AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సొంగడ్డపై ఆస్ట్రేలియాను సస్సుపోయించిన 26 ఏళ్ల బౌలర్.. ఏకంగా 6 వికెట్లతో హల్చల్

Australia vs Bangladesh Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ బౌలర్లు చూపించిన ఈ ప్రదర్శన టెస్టు క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హసన్ మహమూద్ సృష్టించిన ఈ చారిత్రాత్మక రికార్డు రాబోయే తరాల బంగ్లాదేశ్ వేగవంతమైన బౌలర్లకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.

Video: సొంగడ్డపై ఆస్ట్రేలియాను సస్సుపోయించిన 26 ఏళ్ల బౌలర్.. ఏకంగా 6 వికెట్లతో హల్చల్
Aus Vs Ban Hasan Mahmud
Venkata Chari
|

Updated on: Aug 13, 2026 | 11:48 AM

Share

Hasan Mahmud 6 Wickets: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ యంగ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ చరిత్ర సృష్టించాడు. డేంజరస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (71)ను వికెట్ వెనక్కి పంపి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా నేలపై ఈ ఘనత సాధించిన తొలి బంగ్లా బౌలర్‌గా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తన పేరిట 6 వికెట్లను నమోదు చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా గడ్డపై హసన్ మహమూద్ చారిత్రక రికార్డు..

టెస్టు క్రికెట్‌లో బలమైన ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపైనే వణికించడం సాధారణ విషయం కాదు. కానీ బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహమూద్ తన నిప్పులు చెరిగే బౌలింగ్‌తో కాంగ్రూ బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో కెరీర్ బెస్ట్ స్పెల్ విసిరిన అతను, ఆస్ట్రేలియాలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మొదటి బంగ్లాదేశ్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో భారత్, పాకిస్తాన్ జట్లపై కూడా ఐదు వికెట్ల ఘనత సాధించిన ఈ కుర్రాడు, ఇప్పుడు ఆసీస్ పై కూడా అదే మ్యాజిక్ పునరావృతం చేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.

ఇవి కూడా చదవండి

క్రీజులో స్టీవ్ స్మిత్ అరుదైన పొరపాటు..

ఒకవైపు వికెట్లు పడుతున్నా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 71 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తూ ఆస్ట్రేలియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే హసన్ మహమూద్ వేసిన 136.7 కిలోమీటర్ల వేగవంతమైన షార్ట్ బంతిని అంచనా వేయడంలో స్మిత్ పొరపాటు పడ్డాడు. షాట్ ఆడేందుకు ముందుకొచ్చి అనవసర తొందరపాటుతో బంతిని గాల్లోకి లేపాడు. వికెట్ కీపర్ లిటన్ దాస్ ఎటువంటి తప్పు చేయకుండా సులువుగా క్యాచ్ పట్టుకోవడంతో స్మిత్ పోరాటానికి తెరపడింది. టెస్టుల్లో ఎంతో నిలకడగా ఆడే స్మిత్ లాంటి దిగ్గజ ఆటగాడు ఇలాంటి షాట్ ఆడి వికెట్ పారేసుకోవడం నిజంగా అరుదైన విషయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

కకలావికలమైన ఆసీస్ బ్యాటింగ్ లైనప్..

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆరంభం నుంచే బంగ్లాదేశ్ పేసర్లు షాకుల మీద షాకులు ఇచ్చారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (22), జేక్ వెదర్‌ఆల్డ్ (23) ఇద్దరినీ హసన్ మహమూదే పెవిలియన్ దారి పట్టించాడు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్ (1) ను ఎబాదత్ హుస్సేన్ అవుట్ చేయగా, అలెక్స్ కేరీ (19) వికెట్ ను కూడా దక్కించుకున్నాడు. ఆ తర్వాత చివరి వికెట్‌గా నాథన్ లయన్ (7)ను పెవిలియన్ చేర్చాడు. ఇలా మొత్తంగా 6 వికెట్లు పడగొట్టి, సత్తా చాటాడు. మరోవైపు టాస్కిన్ అహ్మద్ తన పదునైన బంతులతో కామరాన్ గ్రీన్ (13), బో వెబ్‌స్టర్ (12) లను పెవిలియన్ పంపాడు.

ఆలౌట్ దిశగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్..

కెప్టెన్ పాట్ కమిన్స్ (9), మిచెల్ స్టార్క్ (1) ల వికెట్లను కూడా హసన్ మహమూదే తీసుకుని ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఒక దశలో కోలుకుంటుంది అనుకున్న ఆస్ట్రేలియా, స్మిత్ వికెట్ కోల్పోవడంతో 189 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో పడింది. మొదటి రోజు మూడో సెషన్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 51.5 ఓవర్లలో 196 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. క్రీజులో నాథన్ లయన్ (7), జోష్ హేజిల్‌వుడ్ (2) ఉన్నారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 54 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా, టాస్కిన్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ బౌలర్లు చూపించిన ఈ ప్రదర్శన టెస్టు క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హసన్ మహమూద్ సృష్టించిన ఈ చారిత్రాత్మక రికార్డు రాబోయే తరాల బంగ్లాదేశ్ వేగవంతమైన బౌలర్లకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us