
Aniket Verma Hits Maiden Half Century in IPL 2025: ఐపీఎల్ అంటేనే యువ ఆటగాళ్లకు ఓ పండుగ లాంటిది. ఇక్కడ తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. ప్రతి సీజన్‌లో చాలా మంది కొత్త ఆటగాళ్ళు ఐపీఎల్‌లో తమ సత్తా చాటుతూనే ఉన్నారు. ఇందులో కొందరు ఆటగాళ్లు అద్భుత ప్రతిభతో ఒక్క మ్యాచ్‌తోనే ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఓ కొత్త పేరు వచ్చి చేరింది. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్‌లతో నిండిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఐపీఎల్ 2025లో సత్తా చాటుతోంది. ఇదే జట్టులో చోటు దక్కించుకున్న ఓ యువ ప్లేయర్ తన మూడవ మ్యాచ్‌లోనే అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఎస్‌ఆర్‌హెచ్ దిగ్గజాలు విఫలమైన చోట ఈ యంగ్ బ్యాట్స్‌మన్ హాఫ్ సెంచరీతో ఢిల్లీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ యంగ్ ప్లేయర్ పేరు అనికేత్ వర్మ. అతను ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్లను ఓడించి అద్భుతమైన అర్ధశతకం సాధించాడు.
విశాఖపట్నంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో, మొదట బౌలింగ్ వేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ను చిత్తు చేసింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ట్రావిస్ హెడ్ కూడా కొద్దిసేపు క్రీజులో నిలబడినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. హైదరాబాద్ జట్టు కేవలం 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో 23 ఏళ్ల అనికేత్ వర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు.
ఐపీఎల్ 2025లో అరంగేట్రం చేసిన అనికేత్ వర్మ.. గత మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో 36 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా అంటే వైజాగ్‌లోనూ హైదరాబాద్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కేవలం 34 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇది ఐపీఎల్‌లో అనికేత్ తొలి అర్ధ సెంచరీ. తన అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత, ఈ బ్యాట్స్‌మన్ అక్షర్ పటేల్‌పై వరుస బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్‌లుస్ కొట్టాడు. అయితే, అతను తన సెంచరీని పూర్తి చేయలేకపోయాడు. 16వ ఓవర్‌లో బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. అనికేత్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే హైదరాబాద్ ఈ కొత్త ఆయుధాన్ని కనుగొంది ఎవరు? ఆ వివరాలు ఏంటో ఇఫ్పుడు తెలుసుకుందాం. అనికేత్ వర్మ మధ్యప్రదేశ్ నివాసి. గత సంవత్సరం ఇక్కడ ఆడిన ఎంపీ టీ20 లీగ్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించాడు. ఈ టోర్నమెంట్‌లో, అతను కేవలం 6 ఇన్నింగ్స్‌లలో 273 పరుగులు చేశాడు. అందులో 25 సిక్సర్లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌లోనే అతను 32 బంతుల్లో సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.
ఆ తర్వాతే, హైదరాబాద్ అనికేత్‌ను వేలంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అంతకు ముందు, అనికేత్ దేశీయ క్రికెట్‌లో సీనియర్ స్థాయిలో ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. ఆ తర్వాత డిసెంబర్ 2024లో, అతను సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఎంపీ తరపున తన టీ20 అరంగేట్రం చేశాడు. తాజాగా ఐపీఎల్‌కి ఎంట్రీ ఇచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..