AUS Vs SL: ఆకట్టుకున్న ఆసీస్ బౌలింగ్.. స్వల్ప స్కోర్‌కే లంక జట్టు కట్టడి.. పూర్తి వివరాలు..

World Cup 2023: వరల్డ్‌కప్‌లో భాగంగా లక్నో వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్‌లో లంక బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. ఓపెనర్లు నిస్సాంక(61), కుశాల్ పెరెరా(78) అర్ధ సెంచరీలతో రాణించినప్పటికీ.. మిడిలార్డర్ సింగిల్ డిజిట్ నెంబర్‌కే పెవిలియన్ చేరింది. కేవలం అసలంక(25) చివర్లో వేగంగా పరుగులు రాబట్టడంతో.. లంక జట్టు 43.3 ఓవర్లకు 209 పరుగులకే ఆలౌట్ అయింది.

AUS Vs SL: ఆకట్టుకున్న ఆసీస్ బౌలింగ్.. స్వల్ప స్కోర్‌కే లంక జట్టు కట్టడి.. పూర్తి వివరాలు..
Aus Vs Sl

Updated on: Oct 16, 2023 | 7:28 PM

వరల్డ్‌కప్‌లో భాగంగా లక్నో వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్‌లో లంక బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. ఓపెనర్లు నిస్సాంక(61), కుశాల్ పెరెరా(78) అర్ధ సెంచరీలతో రాణించినప్పటికీ.. మిడిలార్డర్ సింగిల్ డిజిట్ నెంబర్‌కే పెవిలియన్ చేరింది. కేవలం అసలంక(25) చివర్లో వేగంగా పరుగులు రాబట్టడంతో.. లంక జట్టు 43.3 ఓవర్లకు 209 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టి లంక బ్యాటింగ్ లైనప్ వెన్ను విరచగా.. స్టార్క్, కమ్మిన్స్ చెరో రెండు వికెట్లు, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ రెండు జట్లకు ఇది మూడో మ్యాచ్ కాగా.. మెగా టోర్నమెంట్‌లో ఇంకా ఖాతా తెరవాల్సి ఉంది. మరి ఈ తక్కువ స్కోర్‌ను ఆస్ట్రేలియా జట్టు ఎన్ని ఓవర్లలో చేధిస్తోంది వేచి చూడాలి.

అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్. తన నిర్ణయం సరైనది అనిపించేలా లంక జట్టుకు ఓపెనర్లు ఇద్దరూ చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. నిస్సాంక(61), కుశాల్ పెరెరా(78) కలిసి తొలి వికెట్‌కు 125 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే నిస్సాంక 67 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు చేయగా.. పెరెరా 82 బంతుల్లో 12 ఫోర్లతో 78 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరూ వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో.. శ్రీలంక పతనం మొదలైంది. అసలంక(25) మినహా మిడిలార్డర్ బ్యాటర్లు ఎవ్వరూ కూడా సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. మిడిల్ ఓవర్లలో ఆసీస్ బౌలర్లలైన జంపా, స్టార్క్, కమ్మిన్స్.. ఒకవైపు పేస్.. మరోవైపు స్పిన్‌తో చెలరేగిపోయి.. వరుసగా వికెట్లు తీశారు. తద్వారా ప్రత్యర్ధి జట్టును 209 పరుగులకే పరిమితం చేయగలిగారు. మరోవైపు గత రెండు మ్యాచ్‌లలోనూ ధారాళంగా పరుగులు సమర్పించిన ఆసీస్ బౌలర్లు.. ఈ మ్యాచ్‌లో పొడుపుగా బౌలింగ్ వేయడమే కాదు.. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు.

కాగా, ఇప్పటిదాకా టోర్నమెంట్‌లో చెరో రెండు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్లు.. ఇంకా తమ పాయింట్ల ఖాతాను తెరవలేదు. అటు శ్రీలంక కంటే.. ఆస్ట్రేలియా జట్టుకు ఈ మ్యాచ్ విజయం ఎంతగానో అవసరం. ఫైవ్ టైం వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియా టీం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

మరిన్ని వరల్డ్ కప్ వార్తల కోసం..