
SRH vs RCB Match Tickets: ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే పోరు ఒకటి. మే 22న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు నగరానికి వస్తుండటంతో ఈ మ్యాచ్ చూసేందుకు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు యాజమాన్యం సిద్ధమవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గురువారం సాయంత్రం 5 గంటలకు అధికారిక యాప్ ద్వారా టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే దాదాపు 6 లక్షల మందికి పైగా అభిమానులు ఆన్‌లైన్ క్యూలో వేచి ఉండటం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా టికెట్ల కోసం ఇంతటి పోటీ ఏర్పడటంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. చాలా మంది అభిమానులకు గంటల తరబడి వేచి చూసినా నిరాశే ఎదురైంది.
సాధారణంగా అందుబాటులో ఉండే గ్యాలరీ టికెట్ల ధరలను సైతం ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం భారీగా పెంచిందని ఆరోపణలు వస్తున్నాయి. గత మ్యాచులకు రూ. 750లు ఉన్న టికెట్ ధరను ఇప్పుడు ఏకంగా రూ. 1000లు పెంచారు. అలాగే మిగతా టికెట్లను కూడా ఇలాగే పెంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. డిమాండ్‌ను సాకుగా చూపి సామాన్య అభిమానులకు భారం కలిగించేలా ధరల నిర్ణయం ఉందని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. క్రికెట్‌ను వ్యాపారంగా మార్చవద్దని, స్థానిక అభిమానులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు.
టికెట్ల విక్రయ ప్రక్రియలో పారదర్శకత లేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. విక్రయాలు మొదలైన కొద్దిసేపటికే ‘సోల్డ్ ఔట్’ (అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి) అని బోర్డులు పెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందని వారు అనుమానిస్తున్నారు. కావాలనే టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించి, అధిక ధరలకు అమ్ముకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేడియంలో మ్యాచ్ చూడాలనుకునే నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని, అధికారులు దీనిపై స్పందించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..