లవ్‌స్టోరీస్ సినిమాల్లో చూసేందుకు, నవలల్లో చదివేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. వారి ప్రేమను గెలిపించుకోవడానికి ఇంట్లో వాళ్లను ఎదిరించి..టర్నింగ్‌లు, ఛేజింగ్‌లు, ఫైటింగ్‌లు… అబ్బో ఒక్కటేమిటి చాలా చేయాల్సి ఉంటుంది. అయితే నిజ జీవితంలో ప్రేమలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వారి ప్రేమ కథ వినేందుకు మరింత ఆసక్తిగా కూడా ఉంటాయి. ఇక సెలబ్రిటీల ప్రేమ కహానీ అయితే అందులో మరింత మజాగా ఉంటుంది. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లవ్ స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల లవ్‌స్టోరీ కంటే సౌరవ్ గంగూలీ-డోనాల ప్రేమ కథ మరింత రసవత్తరంగా ఉంటుంది.
సౌరభ్ గంగూలీ- డోనాల పెళ్లయి పాతికేళ్లవుతోంది. వీరిద్దరికీ ఓ కుమార్తె ఉంది. నిజానికి వీరి పెళ్లికి వచ్చిన అడ్డంకులు అన్నీఇన్నీకావు.. డోనా, సౌరవ్ గంగూలీలు చిన్ననాటి స్నేహితులు. ఐతే ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే వార గానీ పెద్దగా మాట్లాడుకునే వారు కాదు. ప్రతి రోజు ఫుట్‌బాల్ ఆడేందుకు సౌరవ్ గంగూలీ డోనా ఇంటి ముందు నుంచే వెళ్లే వాడు. డోనా బయటకు వస్తుందేమో అనే ఒక చిన్న ఆశతో ఆమె ఇంటి ముందు కాసేపు ఆగేవాడు. కానీ డోనా మాత్రం వచ్చేది కాదు. ఓరోజు సౌరవ్ గంగూలీ ఆమెను ఎలాగైనా కలవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అంతే డోనా ఇంట్లోకి షటిల్ కాక్ వేశాడు. దాన్ని తీసుకువచ్చే నెపంతో డోనా ఇంట్లోకి వెళ్లాడు. షటిల్ కాక్ కోసం లోపలికి వెళ్లిన దాదా ఎలాగైతేనేమి డోనాతో మాట కలిపాడు.
డేటింగ్‌కు వస్తావా అని అడగడం.. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఇద్దరూ ఓ చైనీస్ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ సౌరవ్ గంగూలీ రకరకాల ఫుడ్ ఐటెమ్స్ ఆర్డర్ చేసి లాగించేస్తాడు. ఇలా వారి జర్నీ డేటింగ్‌తో మొదలై అదికాస్తా పీకల్లోతు ప్రేమ వరకు దారితీసింది. ఈ క్రమంలో గంగూలీకి ఇంగ్లాండ్‌లో జరిగే లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌కు పిలుపొచ్చింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఇరుకుటుంబాలకు తెలియడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు భగ్గుమన్నాయి. అయినా పెద్దలకు భయపడకుండా రహస్యంగానైనా ఇద్దరూ కలుసుకునేవారు. పైనల్‌గా పెళ్లికి ఇరు కుటుంబాల్లో ససేమిరా అన్నారు.
ఇంగ్లాండ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత గంగూలీ- డోనాను తీసుకుని తన స్నేహితుడి ఇంట్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి విషయం పెద్దలకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. చాలా కాలం తర్వాత ఈ విషయం తెలియడంతో ఇరుకుటుంబాల్లో చిన్న గొడవైనప్పటికీ.. చివరకు ఒప్పుకోవడంతో సౌరవ్-డోనాల ప్రేమకథకు శుభం కార్డు పడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.