
Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన చావో రేవో లాంటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. లక్నో నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు కేవలం 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడుతూ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(69)తో కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 162 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రభ్‌సిమ్రాన్ అవుట్ అయినా అయ్యర్ ఏమాత్రం తగ్గలేదు. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లలో 6 పరుగులు కావాలి, అలాగే అయ్యర్ సెంచరీకి కూడా 6 పరుగులు కావాల్సిన ఉత్కంఠభరిత స్థితిలో.. 18వ ఓవర్ చివరి బంతికి భారీ సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు ఐపీఎల్ కెరీర్‌లో తన తొలి సెంచరీని (51 బంతుల్లో 101*) పూర్తి చేసుకున్నాడు.
కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ ఎమోషనల్
ఈ అద్భుతమైన సెంచరీ సాధించిన అనంతరం శ్రేయస్ అయ్యర్ భావోద్వేగంతో పెద్దగా గర్జిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా ఫామ్ లేమితో సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొన్న అయ్యర్.. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ మ్యాచ్ చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. “గత పదేళ్లుగా ఢిల్లీ రోజుల నుంచి అయ్యర్‌ను ఫాలో అవుతున్నా, అతడిని ఇంత ఎమోషనల్‌గా ఎప్పుడూ చూడలేదు.. నా కళ్లలో నీళ్లు ఆపుకోలేకపోతున్నా” అని ఒక అభిమాని పోస్ట్ చేయగా, “గత 30 రోజులుగా నెట్టింట అతడిపై తీవ్రమైన నెగిటివిటీ నడిచింది, కానీ తనపై తాను నమ్మకముంచి ఈరోజు హీరోలా నిలిచాడు” అంటూ నెటిజన్లు శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కెప్టెన్‌గా ముందుండి నడిపించిన అయ్యర్
పంజాబ్ కింగ్స్ వరుసగా 6 మ్యాచ్ లలో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న తరుణంలో ఈ విజయం ఆ జట్టుకు ఊపిరి పోసింది. జట్టు వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నా, కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జట్టును ముందుకు నడిపించాడు. కేవలం కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా ఈ సీజన్ లో లీడ్ బై ఎగ్జాంపుల్‌గా నిలిచాడు. అయ్యర్ ఈ సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ లలో 168 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీల సహాయంతో 498 పరుగులు సాధించి టాప్ రన్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ అద్భుత విజయంతో పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి చేరుకుంది.
ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠభరితం
లక్నోపై గెలిచి పంజాబ్ కింగ్స్ నాల్గో స్థానానికి చేరినప్పటికీ, వారి ప్లేఆఫ్స్ అర్హత ఇంకా ఖరారు కాలేదు. పంజాబ్ కింగ్స్ లీగ్ దశలో తమ 14 మ్యాచ్ లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు వారి ప్లేఆఫ్స్ భాగ్యం మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఆదివారం జరిగే ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవాలని పంజాబ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే వారు 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటారు. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో కేకేఆర్ గెలిస్తే వారు కూడా 15 పాయింట్లకు చేరుకుంటారు, అప్పుడు నెట్ రన్ రేట్ (NRR) కీలకంగా మారుతుంది. ఇప్పటికే ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్ చేరగా, నాలుగో జట్టు ఏదనేది ఆదివారం జరిగే డబుల్ హెడర్ మ్యాచ్ లతో తేలనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..