Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ మాస్ కమ్‌బ్యాక్..స్టేడియం దాటిన సిక్సర్లు..పూనకాలతో ఊగిన ఫ్యాన్స్‌

Shreyas Iyer : టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన రీఎంట్రీ అద్భుతంగా ఇచ్చాడు. గాయం కారణంగా గత రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న అయ్యర్, విజయ్ హజారే ట్రోఫీలో తన బ్యాట్ పవర్‌ను చూపిస్తూ పరుగుల వరద పారించాడు.

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ మాస్ కమ్‌బ్యాక్..స్టేడియం దాటిన సిక్సర్లు..పూనకాలతో ఊగిన ఫ్యాన్స్‌
Shreyas Iyer (1)

Updated on: Jan 06, 2026 | 3:52 PM

Shreyas Iyer : టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన రీఎంట్రీ అద్భుతంగా ఇచ్చాడు. గాయం కారణంగా గత రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న అయ్యర్, విజయ్ హజారే ట్రోఫీలో తన బ్యాట్ పవర్‌ను చూపిస్తూ పరుగుల వరద పారించాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశాడు.

హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి ముంబై జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. అంటే అయ్యర్ చేసిన 82 పరుగులలో 58 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రావడం గమనార్హం. పరిగెత్తాల్సిన అవసరం లేకుండానే ప్రత్యర్థి బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో బెంబేలెత్తించాడు. శ్రేయస్ స్ట్రైక్ రేట్ 154.72గా ఉండటం చూస్తుంటే అతను ఎంతటి భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ముంబై జట్టు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తింది. స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (15), సర్ఫరాజ్ ఖాన్ (21) త్వరగానే అవుట్ అయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అయ్యర్, ముషీర్ ఖాన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. మొదట ఆచితూచి ఆడిన అయ్యర్, ఆ తర్వాత గేర్ మార్చి హిమాచల్ బౌలర్లు మయాంక్ దాగర్, కుశాల్ పాల్‌పై విరుచుకుపడ్డాడు. కేవలం 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసేలా కనిపించినా, కుశాల్ పాల్ బౌలింగ్‌లో అమన్‌ప్రీత్‌కు క్యాచ్ ఇచ్చి దురదృష్టవశాత్తూ అవుట్ అయ్యాడు.

న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ ఎంపికైనప్పటికీ, అతను మ్యాచ్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలని బీసీసీఐ షరతు పెట్టింది. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన అయ్యర్, తన అద్భుతమైన బ్యాటింగ్, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్‌తో పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని చాటిచెప్పాడు. విజయ్ హజారే ట్రోఫీలో అయ్యర్ రికార్డులు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌లో అతని యావరేజ్ 60కి పైగా ఉంది. ఇప్పటివరకు 1900కు పైగా పరుగులు చేసిన శ్రేయస్ ఖాతాలో 7 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..