Shikar Dhawan: టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikar Dhawan) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో బయట అంతే ఫన్నీగా ఉంటాడు. సహచరులతో సరదాగా జోకులేస్తూ ఆ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఆ మధ్యన తండ్రితో చెంపదెబ్బలు తిన్న వీడియో ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా అలాంటి ఫన్నీ వీడియోతోనే మళ్లీ మన ముందుకొచ్చాడీ స్టార్ క్రికెటర్. ఇందులో ఓ రెస్టారెంట్‌లో ధావన్ డైనింగ్‌టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. రోటీలు, అన్నం, రకరకాల కర్రీలు, వేపుళ్లు, సలాడ్లతో అప్పటికే అతని ప్లేట్ నిండిపోయి ఉంటుంది. శిఖర్ వాటిని ఇంకా ఆరగించకముందే పక్కనే ఉన్న ఇద్దరు సర్వర్లు వడ్డించడం ప్రారంభిస్తారు. దీంతో ధావన్ ‘అరె భయ్యా ప్లేట్‌లో ఖాళీ లేదు.. కొద్దిసేపు ఆగండి’ అని అంటాడు. కానీ క్రికెటర్ మాటనను పెడచెవిన పెట్టిన సర్వర్లు.. ‘అరె మీ ప్లేట్‌లో చాలా ఖాళీ ఉంది.. ముందు మీరు తినండి సర్’ అని వడ్డిస్తూనే ఉంటారు.
దీంతో విసిగిపోయిన ధావన్ ‘మీ అతి ప్రేమ తగలయ్యా.. తిండితోనే నన్న చంపేసేలా ఉన్నారు’ అని అంటాడు. ప్రస్తుతంఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అలాగే 4.5 లక్షల మంది లైకులు కొట్టారు. 2వేల కామెంట్లు కూడా వచ్చాయి. కాగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే గబ్బర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 11.1 మిలియన్ ఫాలోవర్లు ఉండడం విశేషం. ఇక క్రికెట్ విషయానికొస్తే.. ఇటీవల విండీస్ తో జరిగిన వన్డే సిరీస్‌లో అటు నాయకుడిగా.. ఇటు బ్యాటర్ గా శిఖర్ అదరగొట్టాడు. ఆటగాడిగా మూడు వన్డేల్లో 168 పరుగులు చేయడంతో పాటు కెప్టెన్ గా విండీస్‌ను వైట్‌వాష్ చేశాడు. త్వరలోనే జింబాబ్వేలో పర్యటించనున్న భారత జట్టుకు మళ్లీ సారథ్యం వహించే అవకాశం అందుకున్నాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..