Shahid Afridi : 2027 వరల్డ్ కప్ వరకు వాళ్లే బ్యాక్‌బోన్.. గౌతమ్ గంభీర్‌పై అఫ్రిది ఫైర్
Shahid Afridi : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత క్రికెట్‌పై సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి అతను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఘాటుగా విమర్శలు గుప్పించడమే కాకుండా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు గట్టిగా మద్దతు పలికారు.

Shahid Afridi : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత క్రికెట్‌పై సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి అతను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఘాటుగా విమర్శలు గుప్పించడమే కాకుండా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు గట్టిగా మద్దతు పలికారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు వెన్నెముకలా ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత జట్టుకు మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరని అఫ్రిది అన్నారు. ఇటీవల సౌతాఫ్రికా సిరీస్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనను ఉదాహరణగా చూపిస్తూ.. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు వీరు భారత జట్టుకు బ్యాక్‌బోన్ గా కొనసాగుతారని ఆయన బలంగా నొక్కి చెప్పారు. “విరాట్, రోహిత్ భారత బ్యాటింగ్ లైనప్‌కు నిజంగా వెన్నెముక. వారి తాజా ప్రదర్శనను బట్టి వారు 2027 వరల్డ్ కప్ వరకు సులభంగా ఆడగలరని స్పష్టమవుతోంది” అని అఫ్రిది పేర్కొన్నారు.
కోహ్లీ, రోహిత్‌లను భారత్ ముఖ్యమైన టోర్నమెంట్‌లలో, కీలక సిరీస్‌లలో తప్పకుండా ఆడించాలని అఫ్రిది సలహా ఇచ్చారు. అయితే భారత జట్టు బలహీనమైన ప్రత్యర్థితో ఆడుతున్నప్పుడు, యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు వారిద్దరికీ విశ్రాంతి ఇవ్వవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల కీలక ఆటగాళ్లు పెద్ద టోర్నీలకు పవర్పుల్ గా ఉండవచ్చని సూచించారు.
అఫ్రిది వ్యాఖ్యల్లో అత్యంత చర్చనీయాంశమైన భాగం, ఆయన భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై చేసిన దాడి. గతంలో మైదానంలో కూడా వీరిద్దరి మధ్య అనేక వివాదాలు జరిగాయి. అఫ్రిది మాట్లాడుతూ.. “గౌతమ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన తీరు చూస్తే, తన అభిప్రాయమే ఎప్పుడూ సరైంది అని అతను భావిస్తున్నట్లు అనిపించింది. కానీ కొంతకాలం తర్వాత, మీరు ఎప్పుడూ సరైన వారు కాలేరని నిరూపితమైంది” అని గంభీర్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. కాగా గంభీర్ ఇప్పటికే 2027 వరల్డ్ కప్ ఇంకా చాలా దూరంలో ఉందని, యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి జట్టుకు కొత్త దిశానిర్దేశం చేయాలని చూస్తున్నట్లు స్పష్టం చేశారు.
వన్డేలలో అత్యధిక సిక్సర్ల విషయంలో తన రికార్డును భారత కెప్టెన్ రోహిత్ శర్మ అధిగమించడంపై అఫ్రిది సంతోషం వ్యక్తం చేశారు. “రికార్డులు బద్దలు కొట్టబడటానికే ఉంటాయి. నా రికార్డును రోహిత్ లాంటి క్లాసీ బ్యాట్స్‌మన్ బద్దలు కొట్టినందుకు నేను సంతోషిస్తున్నాను” అని ఆయన అన్నారు. సౌతాఫ్రికా పై రాయ్‌పూర్ వన్డేలో రోహిత్ తన కెరీర్‌లో 355వ సిక్సర్ కొట్టి అఫ్రిది (351 సిక్సర్లు) రికార్డును అధిగమించారు. పాత రోజులను గుర్తు చేసుకుంటూ 2008 ఐపీఎల్ లో తాను డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడుతున్నప్పుడే రోహిత్ ఒక రోజు భారతదేశంలో పెద్ద ప్లేయర్ అవుతాడని తాను గుర్తించానని అఫ్రిది ప్రశంసించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




