AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్థాన్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన చెన్నై.. శాంసన్ అట్టర్ ఫ్లాప్.. జడేజా సూపర్ హిట్..!

గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సంజు శామ్సన్ నుంచి మెరుపు ఇన్నింగ్స్‌ను ఆశించారు. గాయం కారణంగా ధోనీ దూరం కావడంతో, సంజుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, నాండ్రే బర్గర్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి సంజు శామ్సన్ (6 పరుగులు, 7 బంతులు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

రాజస్థాన్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన చెన్నై.. శాంసన్ అట్టర్ ఫ్లాప్.. జడేజా సూపర్ హిట్..!
Rr Vs Csk Ipl 2026
Venkata Chari
|

Updated on: Mar 30, 2026 | 9:25 PM

Share

ఐపీఎల్ మూడవ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను 127 పరుగులకే ఆలౌట్ చేసింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై తరఫున జేమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అరంగేట్రం చేసిన కార్తిక్ శర్మ 18 పరుగులు చేయగా, కీలక ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ 17 పరుగులు చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ 10 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు.

17 ఏళ్ల తర్వాత రాజస్థాన్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్న రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్ కూడా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, అరంగేట్రం చేసిన బ్రిజేష్ శర్మ చెరో వికెట్ తీశారు. ఒక బ్యాట్స్‌మన్ రనౌట్ కూడా అయ్యాడు.

కుప్పకూలిన చెన్నై బ్యాటింగ్..

కేవలం సంజు మాత్రమే కాదు, రాజస్థాన్ బౌలర్ల ధాటికి చెన్నై టాప్ ఆర్డర్ మొత్తం కుదేలైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా జోఫ్రా ఆర్చర్ వేసిన ప్రమాదకర బంతికి 6 పరుగులకే అవుట్ అయ్యాడు. యువ ఆటగాడు ఆయుష్ మ్హత్రే సున్నా పరుగులకే పెవిలియన్ చేరడంతో చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి సీఎస్కే 41 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్లు పడడం ఆగలేదు. సర్ఫరాజ్, శివం దుబే, కార్తీక్ శర్మ నూర్ అహ్మద్ ఇలా వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. 12.5 ఓవర్లకే 8 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్టిన్ ఒక్కడే చెన్నై తరపున ధాటిగా ఆడాడు. ఓవర్టన్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 43 పరుగులు చేసి చివరి వికెట్ గా పెవిలియన్ చేరాడు.

‘లయబిలిటీ’గా మారతాడా?

రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ అయిన సంజు శామ్సన్, తన పాత జట్టుపైనే విఫలం కావడం విశేషం. రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వైదొలిగిన తర్వాత సంజు కూడా జట్టు మారడం సంచలనం సృష్టించింది. కానీ ఇప్పుడు చెన్నైకి అతను భారంగా (Liability) మారుతున్నాడని అభిమానులు విమర్శిస్తున్నారు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో బాధ్యతారహితంగా వికెట్ పారేసుకోవడంపై విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారు.

జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(కీపర్), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.

Follow Us