AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ruturaj Gaikwad : అఫ్ఘన్ సిరీస్‌లో చోటు దక్కలేదన్న కోపమా.. సెంచరీతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్

Ruturaj Gaikwad : అఫ్గానిస్తాన్ సిరీస్‌లో చోటు దక్కకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీతో సమాధానం ఇచ్చాడు. ఇండియా ఏ జట్టు తరఫున శ్రీలంక ఏపై 101 పరుగులు చేసి తన క్లాస్ చూపించాడు. బీసీసీఐ సెలెక్టర్లపై ప్రశ్నలు మరింత పెరిగాయి.

Ruturaj Gaikwad : అఫ్ఘన్ సిరీస్‌లో చోటు దక్కలేదన్న కోపమా.. సెంచరీతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్
Ruturaj Gaikwad
Rakesh
|

Updated on: Jun 09, 2026 | 2:42 PM

Share

Ruturaj Gaikwad : బీసీసీఐ సెలెక్టర్ల నిర్ణయాలపై తరచూ విమర్శలు వస్తుంటాయి. తాజాగా అఫ్గానిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియా జట్టును ఎంపిక చేసినప్పుడు, సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ అవమానానికి రుతురాజ్ ఏమాత్రం కుంగిపోకుండా మైదానంలోనే తన బ్యాట్‌తో గట్టి సమాధానం చెప్పాడు. జూన్ 9న జరిగిన ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంక-ఎ జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు.

ఈ మ్యాచ్‌లో ఇండియా-ఎ కెప్టెన్ తిలక్ వర్మ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే జట్టుకు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. ఐపీఎల్ 2026లో తన ఆటతో అందరినీ ఆకట్టుకున్న యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా 2 పరుగులకే ఫెవీలియన్ బాట పట్టాడు. ఇక ప్రియాంశ్ ఆర్య రనౌట్ రూపంలో దురదృష్టవశాత్తూ అవుట్ కావడంతో ఇండియా-ఎ జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో సీనియర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు.

మూడు వికెట్లు త్వరగా పడిపోయిన తరుణంలో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్ తిలక్ వర్మ నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. వీరిద్దరూ కలిసి శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. నిలకడగా ఆడుతూనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడి నాలుగో వికెట్‌కు ఏకంగా 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ రూపురేఖలనే మార్చేసింది. తిలక్ వర్మ ఒకవైపు యాంకర్ రోల్ పోషిస్తుండగా, రుతురాజ్ సింగిల్స్ తీస్తూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ లంక బౌలర్లను విసిగించాడు.

రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో అత్యంత క్లాస్ ఇన్నింగ్స్ ఆడి 112 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ రుతురాజ్‌కు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది అతనికి 100వ లిస్ట్-ఎ మ్యాచ్. తన వందో మ్యాచ్‌లోనే కెరీర్‌లో 21వ లిస్ట్-ఎ సెంచరీ సాధించి ఈ ఘనతను మరింత చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. ఒత్తిడిని అధిగమిస్తూ అతను ఆడిన ఈ ఇన్నింగ్స్ అతనిలోని టెక్నికల్ స్కిల్స్, మానసిక బలాన్ని మరోసారి నిరూపించింది.

విరాట్ కోహ్లీ గాయం కారణంగా అఫ్గానిస్తాన్ సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో సెలెక్టర్లు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేశారు. అయితే, జైస్వాల్ హిట్టింగ్ ఓపెనర్ అయినప్పటికీ.. వన్డేల్లో 3 లేదా 4వ నంబర్ పొజిషన్‌లో ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు రుతురాజ్ గైక్వాడ్ సరైన ప్రత్యామ్నాయం అని క్రికెట్ విశ్లేషకులు భావించారు. విరాట్ కోహ్లీ లాగే స్ట్రైక్ రొటేట్ చేయడం, ఒత్తిడిని తట్టుకుని భారీ ఇన్నింగ్స్ ఆడటం గైక్వాడ్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు అతను చేసిన ఈ సెంచరీతో, బీసీసీఐ సెలెక్టర్లు అతడిని జట్టులోకి తీసుకోకుండా తప్పు చేశారనే వాదనకు మరింత బలం చేకూరింది.

భారీ సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 114 బంతుల్లో 101 పరుగులు చేసిన తర్వాత అతను అవుట్ అయ్యాడు. వనుజ సహన్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని మోకాళ్లపై కూర్చుని స్లాగ్ స్వీప్ చేయడానికి రుతురాజ్ ప్రయత్నించాడు. కానీ బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో డీప్ మిడ్-వికెట్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అవిష్క ఫెర్నాండో కుడివైపునకు పరిగెత్తుకుంటూ వచ్చి బౌండరీ లైన్ దగ్గర చక్కని క్యాచ్ పట్టడంతో రుతురాజ్ ఇన్నింగ్స్ ముగిసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us