RR vs KKR, IPL 2022 Match Result: ఐపీఎల్ 2022 లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. టోర్నీ ప్రారంభంలో అదరగొట్టిన ఆ జట్టు ఇప్పుడు హ్యాట్రిక్ పరాజయాలను ఎదుర్కొంది. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ (RR vs KKR)లో శ్రేయస్ సేన 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పింక్ ఆర్మీ స్పిన్నర్ యుజువేంద్రా చాహల్ హ్యాట్రిక్ తో పాటు ఐదు వికెట్లు తీసి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఈ సీజన్‌లో 217/5 పరుగుల భారీస్కోరు సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (85), ఓపెనర్ ఫించ్ (58) రాణించడంతో ఛేదనలో చివరి వరకు పోరాడింది కోల్‌కతా. అయితే చాహల్ స్పిన్ మ్యాజిక్‌కు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో 19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటై 7 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. హ్యాట్రిక్ తో పాటు ఐదు వికెట్లతో రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన యూజీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. కాగా ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి 7 మ్యాచ్‌లో ఇది నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆజట్టు ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
చివరి వరకు పోరాడినా..
218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా మొదటి బంతికే వికెట్ కోల్పోయింది. సమన్వయ లోపంతో సునీల్ నరైన్ మొదటి బంతికే రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఓపెనర్ ఆరోన్ ఫించ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ధాటిగా ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే వీరు తప్ప మరే బ్యాటర్ క్రీజులో నిలవలేదు. నితీశ్ రాణా (18), ఆండ్రీ రస్సెల్ (0), షెల్డన్ జాక్సన్ (8) పూర్తిగా నిరాశపరిచారు. ఇక చివర్లో ఉమేష్ యాదవ్ ( 9 బంతుల్లో 21) ధాటిగా ఆడి జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. అయితే చాహల్ వరుసగా వికెట్లు తీయడంతో ఓటమి తప్పించుకోలేకపోయింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 217 పరుగుల భారీస్కోరు సాధించింది. జోస్ బట్లర్ ఈ సీజన్‌లో రెండవ సెంచరీని నమోదు చేశాడు. మొత్తం 61 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 168కి పైగా స్ట్రైక్ రేట్‌తో 103 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ (38), హెట్మెయర్ (26), పడికల్ (24) కూడా తలా ఓ చేయి వేయడంతో ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది రాజస్థాన్. కోల్‌కతా బౌలర్లలో నరైన్ (21/2) తప్ప మిగతా వారెవరూ ప్రభావం చూపలేకపోయారు.
One emoji to describe THAT win. ?? pic.twitter.com/7HCoMiGPlu
— Rajasthan Royals (@rajasthanroyals) April 18, 2022
Also Read:AP News: టీడీపీ లీడర్స్ చంద్రబాబు, లోకేశ్ పై కేసు.. కల్యాణదుర్గం ఠాణాలో ఫిర్యాదు
BIS Recruitment: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 337 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..