Rohit Sharma : వరల్డ్ కప్ ప్లాన్స్ నుంచి రోహిత్ అవుట్.. పాండ్యా ఇన్.. అసలేం జరుగుతోంది ?

Rohit Sharma : మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా బెంగళూరు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇంకా రిపోర్ట్ చేయలేదు. దీంతో ఆయన అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్‌తో పాటు 2027 వరల్డ్ కప్ ప్లాన్స్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది.

Rohit Sharma : వరల్డ్ కప్ ప్లాన్స్ నుంచి రోహిత్ అవుట్.. పాండ్యా ఇన్.. అసలేం జరుగుతోంది ?
Rohit Sharma

Updated on: Jun 02, 2026 | 2:51 PM

Rohit Sharma : భారత క్రికెట్ అభిమానులకు ఒక బిగ్ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టీమిండియా లెజెండరీ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి క్రమంగా తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన తీసుకుంటున్న తాజా నిర్ణయాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, భారత్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‎కు టీమిండియా జట్టును ప్రకటించినప్పటికీ.. అందులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల ఆడటం వారి ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అవ్వడం పైనే ఆధారపడి ఉంది. అయితే తాజాగా హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ పరీక్షల కోసం బెంగళూరు వెళ్తుండగా, రోహిత్ శర్మ మాత్రం ఇంకా అక్కడికి చేరుకోకపోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

బీసీసీఐ రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే యువ జట్టును సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే అఫ్గానిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు యువ సంచలనం శుభ్‌మన్ గిల్‎ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ జట్టులో ఉన్నప్పటికీ, గిల్ సారథ్యంలోనే ఈ సిరీస్ సాగనుంది. కానీ రోహిత్ శర్మ ఈ సిరీస్ ఆడటంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్ శర్మ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో తీవ్రమైన హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యారు. ఆ మ్యాచ్‌లో ఆయన రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరగడమే కాకుండా, ఆ తర్వాత ముంబై ఫ్రాంచైజీ ఆడిన ఐదు కీలక మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో పునరాగమనం చేసినప్పటికీ.. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా సీజన్ మొత్తం కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గానే బ్యాటింగ్‌కు వచ్చారు.

రోహిత్ శర్మకు ఉన్న గాయం దృష్ట్యా.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ జట్టులో రోహిత్ శర్మ మరియు హార్దిక్ పాండ్యాలను చేర్చినప్పటికీ.. వారు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‎కి వెళ్లి మెడికల్ టీమ్ ముందు ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అవ్వాలని నిబంధన విధించింది. అక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తేనే వారు మైదానంలోకి దిగడానికి అర్హత సాధిస్తారు.

తాజా నివేదికల ప్రకారం.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జూన్ 2నే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యారు. మెడికల్ టీమ్ ఇచ్చే ఫిట్‌నెస్ క్లియరెన్స్ తర్వాత ఆయన జట్టుతో కలవనున్నారు. కానీ, రోహిత్ శర్మ ఎప్పుడు బెంగళూరు వస్తారనే దానిపై టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. రోహిత్ ఇంకా బెంగళూరు వెళ్లకపోవడంతో ఆయన అఫ్గానిస్తాన్ సిరీస్ ఆడటం కష్టమేనని, అలాగే భవిష్యత్తు వరల్డ్ కప్ ప్లాన్స్ నుంచి కూడా ఆయన తప్పుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us