Rishabh Pant: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. ఆసియాకప్‌, ప్రపంచకప్‌కు రిషబ్‌ పంత్‌ దూరం!! వికెట్‌ కీపర్‌ ఎవరంటే?

|

Apr 26, 2023 | 5:04 PM

గత కొన్నేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో తీవ్రంగా నిరాశపరుస్తోన్న టీమిండియా స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో విజయబావుటా ఎగురవేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది.

Rishabh Pant: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. ఆసియాకప్‌, ప్రపంచకప్‌కు రిషబ్‌ పంత్‌ దూరం!! వికెట్‌ కీపర్‌ ఎవరంటే?
Rishabh Pant
Follow us on

ఈ ఏడాది అక్టోబరు, నవంబర్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోంది. గత కొన్నేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో తీవ్రంగా నిరాశపరుస్తోన్న టీమిండియా స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో విజయబావుటా ఎగురవేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రదర్శనపై కన్నేసిన బీసీసీఐ.. ప్రపంచకప్ కోసం జట్టు ఎంపికపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వన్డే ప్రపంచకప్‌కు బీసీసీఐ 20 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత డిసెంబర్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్‌ను ప్రపంచకప్ జట్టులో వికెట్ కీపర్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ భావించింది. ప్రపంచకప్‌ నాటికి పంత్ కోలుకుంటాడని బీసీసీఐ అనుకుంది. అయితే ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌లోనూ పంత్‌ ఆడలేడని తెలుస్తోంది.

ప్రస్తుతమున్న నివేదికల ప్రకారం, పంత్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు. అయితే అతను పూర్తిగా కోలుకుని మైదానంలో అడుగుపెట్టడానికి ఇంకా ఏడెనిమిది నెలల సమయం కావాలి. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ.. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే జనవరి తర్వాతే పంత్ జట్టులో చేరే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న పంత్‌కు బీసీసీఐ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పంత్‌కు ఈ ఏడాది జనవరిలో శస్త్రచికిత్స జరిగింది. మొత్తం ఖర్చును బీసీసీఐ భరించింది. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌లో పంత్‌ ప్లేసులో సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే కేఎల్‌ రాహుల్‌, శ్రీకర్‌ భరత్‌లు కూడా వికెట్‌ కీపింగ్‌ రేసులో ఉన్నారు. వీరే కాక యువ వికెట్‌కీపర్లు సర్ఫరాజ్‌ ఖాన్‌ (ఢిల్లీ), ఉపేంద్ర యాదవ్‌ (సన్‌రైజర్స్‌), ధృవ్‌ జురెల్‌ (రాజస్థాన్‌), ఆనూజ్‌ రావత్‌ (ఆర్సీబీ), విష్షు వినోద్‌ (ముంబై) కూడా బీసీసీఐ లిస్టులో ఉన్నారని తెలుస్తోంది. మరి వన్డే వరల్డ్‌ కప్‌లో వికెట్‌ కీపర్‌గా బీసీసీఐ ఎవరికి అవకాశం కల్పిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..