
Ravindra Jadeja Wife Rivaba Jadeja: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. తన భర్తను పొగిడే క్రమంలో ఆమె ఇతర భారత క్రికెటర్లపై పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేయడం వివాదానికి దారితీసింది.
ఒక బహిరంగ రాజకీయ సభలో మాట్లాడుతూ రివాబా జడేజా తన భర్త గొప్పతనాన్ని వివరించింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. “నా భర్త రవీంద్ర జడేజా క్రికెట్ ఆడటానికి లండన్, దుబై, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు వెళ్తుంటారు. అక్కడ ఎన్ని ప్రలోభాలు ఉన్నా, అతను ఎప్పుడూ ఎలాంటి చెడు అలవాట్లకు లోనుకాలేదు. అతను తన బాధ్యతలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి చాలా పద్ధతిగా ఉంటాడు” అని చెప్పుకొచ్చింది.
అయితే, ఇక్కడితో ఆగకుండా ఆమె ఇతర ఆటగాళ్ల గురించి ప్రస్తావించడం వివాదానికి కారణమైంది. “నా భర్త నిజాయితీగా ఉంటారు. కానీ, విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు టీమిండియాలోని ఇతర ఆటగాళ్లు మాత్రం చెడు వ్యసనాలు, కార్యకలాపాల్లో మునిగిపోతుంటారు” అని రివాబా ఆరోపించినట్లు తెలుస్తోంది. ఇతర ఆటగాళ్లు ఎవరనేది ఆమె స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, అందరినీ ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రివాబా వ్యాఖ్యలపై నెటిజన్లు, ముఖ్యంగా ఇతర క్రికెటర్ల అభిమానులు మండిపడుతున్నారు. “మీ భర్త మంచితనాన్ని చాటుకోవడానికి, మొత్తం జట్టును కించపరచడం సరికాదు” అని విమర్శిస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రవీంద్ర జడేజా ఇటీవల టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రివాబా చేసిన ఈ వ్యాఖ్యలు జట్టు వాతావరణంపై ప్రభావం చూపిస్తాయేమోనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..