IPL 2025: రాహుల్ ద్రవిడ్ vs సంజు శాంసన్..! రాజస్థాన్ టీమ్‌లో ఏం జరుగుతోంది.. విభేదాలు నిజమేనా..?
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ప్రదర్శన నిరాశపరిచేలా ఉంది. కెప్టెన్ సంజు శాంసన్‌ను పక్కన పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ కూడా జట్టులోని అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ అంతర్గత విభేదాలు రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ బాగా ఆడుతున్నట్లు కనిపిస్తున్నా.. విజయాలు మాత్రం సాధించలేకపోతుంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌ఆర్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 189 పరుగుల టార్గెట్‌ను ఈజీ ఛేజ్ చేసేలా కనిపించినా.. చివరి ఓవర్‌లో 9 రన్స్ చేయలేక మ్యాచ్‌ను టై చేసుకుంది. అలాగే సూపర్ ఓవర్‌లోనూ ఫేలవ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఢిల్లీకి అప్పగించింది. ఆ మ్యాచ్ సూపర్ థ్రిల్లర్‌లా ముగిసినా.. రాజస్థాన్‌కు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. మ్యాచ్ సంగతి పక్కనపెడితే.. అసలు రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఏదో జరుగుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అందుకు కారణం ఒక వీడియో. ఆ వీడియో ఏంటంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సూపర్ ఓవర్‌కి ముందు ఎవరు బ్యాటింగ్‌కి వెళ్లాలనే విషయంలో రాజస్థాన్ డగౌట్‌లో చర్చలు నడుతుస్తున్నాయి. జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఇతర కీలక వ్యక్తులు, ఆటగాళ్లు ఆ చర్చలో పాల్గొన్నారు. కానీ, కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం అక్కడ లేడు. పైగా అక్కడే పక్కగా వెళ్తూ కూడా ఆ చర్చను పట్టించుకోలేదు, అలాగని సంజు శాంసన్‌ను ఎవరు పిలవలేదు. అతని ఒపినీయన్‌ను ఎవరు తెలుసుకోలేదు. ఎంతో కీలకమైన సూపర్ ఓవర్‌లో ఎవరు బ్యాటింగ్‌కు వెళ్లాలని చర్చించే టీమ్ మీటింగ్‌లో కెప్టెన్ ఇన్వాల్‌మెంట్ లేకపోవడం ఏంటని చాలా మంది క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. అసలు రాజస్థాన్ టీమ్‌లో ఏదో జరుగుతుందని, సంజు శాంసన్‌ను కావాలనే పట్టించుకోవడం లేదని కూడా చాలా మంది భావిస్తున్నారు. శాంసన్‌ను పక్కనపెట్టి.. రాబోయే సీజన్‌లో రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఆర్‌ఆర్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఇప్పటికే సంజుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు పరాగ్ కెప్టెన్సీ వహించిన విషయం తెలిసిందే. అలాగే రాజస్థాన్‌లోని జైపూర్‌తో పాటు అస్సాంలోని గౌహతిలో కూడా ఆర్‌ఆర్ మ్యాచ్‌లను నిర్వహించడంపై కూడా సంజు శాంసన్ కాస్త అంసతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కావాలనే రియాన్ పరాగ్‌ను జాకీలు పెట్టి లేపుతున్నారనే వాదన టీమ్‌లో కూడా వినిపిస్తోంది. పరాగ్ సొంత రాష్ట్రం అస్సాం.. అందుకే అక్కడ కూడా మ్యాచ్‌లు పెడుతున్నారని చాలా మంది అనుకుంటున్నారు. దాంతో పాటు జట్టులోని ప్రతి నిర్ణయం కూడా హెడ్ కోచ్ ద్రవిడ్ తీసుకుంటున్నాడు. కనీసం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరుండాలి, బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలి ఇలాంటి విషయాల్లో కూడా సంజు శాంసన్ నిర్ణయాలకు విలువ ఇవ్వకుండా మొత్తంగా ద్రవిడ్ మాత్రమే చూసుకుంటున్నట్లు సమాచారం. ఇది కూడా సంజును తీవ్రంగా వేధిస్తోంది.
అతనితో పాటు జట్టులోని మరో కీ ప్లేయర్ యశస్వి జైస్వాల్ సైతం టీమ్‌లో అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సంజు శాంసన్ తర్వాత తనకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పరాగ్‌కు ప్రియారిటీ ఇవ్వడంపై జైస్వాల్ అన్‌హ్యాపీగా ఉన్నాడు. సంజు శాంసన్ అందుబాటులో లేనప్పుడు కెప్టెన్సీ విషయంలో తనను కన్సిడర్ చేయకపోవడం కూడా జైస్వాల్ అసంతృప్తిగా కారణం. అందుకే వచ్చే ఐపీఎల్ సీజన్‌లో సంజు శాంసన్‌తో పాటు జైస్వాల్ కూడా రాజస్థాన్ రాయల్స్‌ను వీడే అవకాశం ఉందని క్రికెట్ సర్కిల్స్‌లో చాలా బలంగా వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే.. నిజంగా రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో సరైన వాతావరణం లేదనే విషయం స్పష్టమవుతోంది. చూడాలి మరి ఈ సీజన్ తర్వాత ఆర్‌ఆర్ టీమ్‌లో ఎలాంటి పెను మార్పులు సంభవిస్తాయో.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




