Anvay Dravid : సెలక్టర్ల బిగ్ డెసిషన్.. టీమిండియాలోకి రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు.. !

Anvay Dravid : రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రావిడ్ భారత్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ ఆడనున్న అతడు వికెట్ కీపర్-బ్యాటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యువ క్రికెటర్‌గా అతని ప్రస్థానంపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

Anvay Dravid : సెలక్టర్ల బిగ్ డెసిషన్.. టీమిండియాలోకి రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు.. !
Anvay Dravid

Updated on: Jun 12, 2026 | 1:35 PM

Anvay Dravid : భారత క్రికెట్ చరిత్రలో ది వాల్‎గా పేరుగాంచిన మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రావిడ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. జూలై 4 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన కోసం భారత అండర్-19 క్రికెట్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఎస్.శరత్ నేతృత్వంలోని జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన ఈ జట్టులో 17 ఏళ్ల అన్వయ్ ద్రావిడ్‌కు చోటు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు లంకతో మూడు వన్డేలు, రెండు మల్టీ-డే (లిస్ట్-ఏ) మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు జట్లకు యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ప్రస్తుతం 17 సంవత్సరాల 45 రోజుల వయసు ఉన్న అన్వయ్ ద్రావిడ్‌ను వైట్ బాల్ (వన్డే) సిరీస్ కోసం సెలెక్టర్లు ఎంపిక చేశారు. అన్వయ్ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణించడంతో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించగలడు. గత అండర్-19 ప్రపంచకప్‌కు ముందు జరిగిన సన్నాహక టోర్నీల్లో కూడా అన్వయ్ భారత్ బ్లూ జట్టు తరఫున త్రైపాక్షిక సిరీస్‌లో భాగమయ్యాడు. అయితే అప్పట్లో అతనికి కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆడే అవకాశం వచ్చింది. ఇప్పుడు వయసు, ఫామ్ అనుకూలంగా ఉండటంతో తదుపరి అండర్-19 ప్రపంచకప్ సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు అతనికి ఈ మెగా ఛాన్స్ ఇచ్చారు.

గతేడాది జరిగిన ప్రతిష్టాత్మక వినూ మన్కడ్ ట్రోఫీలో అన్వయ్ ద్రావిడ్ తన అద్భుత కెప్టెన్సీతో కర్ణాటక జట్టును క్వార్టర్ ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ఆ టోర్నీలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 220 రన్స్ చేశాడు. ఇందులో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, 93 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచి కర్ణాటకకు అద్భుత విజయాన్ని అందించాడు. అలాగే చండీగఢ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో కూడా 75 బంతుల్లో 63 రన్స్‌తో హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు డిసెంబర్‌లో జరిగిన విజయ్ మర్చంట్ ట్రోఫీలో కూడా అన్వయ్ తన తొలి సెంచరీ మార్కును అందుకోవడం విశేషం.

రాహుల్ ద్రావిడ్ కుటుంబం నుండి అండర్-19 జట్టుకు ఎంపికైన రెండో ఆటగాడు అన్వయ్. 2024 ప్రారంభంలో ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రావిడ్ ఆస్ట్రేలియాతో జరిగిన హోమ్ సిరీస్ కోసం భారత్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ గాయం కారణంగా సమిత్ ఆ మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు తమ్ముడు అన్వయ్ నేరుగా విదేశీ పర్యటనకు ఎంపికై తండ్రి తగ్గ వారసుడిగా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ లంక పర్యటనలో గనుక అన్వయ్ క్లిక్ అయితే, భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులో కూడా ద్రావిడ్ పేరు మళ్లీ మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us