Smriti Mandhana Wedding : త్వరలోనే ఇద్దరి పెళ్లి..రూమర్స్‌పై స్పందించిన పలాష్ తల్లి.. ఏమన్నారంటే?
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం ఎప్పుడెప్పుడా అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం స్మృతి తండ్రికి అనారోగ్య సమస్య కారణంగా వాయిదా పడింది.

Smriti Mandhana Wedding : భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం ఎప్పుడెప్పుడా అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం స్మృతి తండ్రికి అనారోగ్య సమస్య కారణంగా వాయిదా పడింది. అయితే ఈ వాయిదా వెనుక పలాష్ మోసం చేశాడంటూ కొన్ని రూమర్లు, స్క్రీన్ షాట్‌లు వైరల్ కావడంతో ఈ జంట వార్తల్లో నిలిచింది. ఈ మొత్తం వివాదంపై పలాష్ తల్లి అమిత ముచ్చల్ స్పందించారు. రూమర్స్‌ను తోసిపుచ్చుతూ, త్వరలోనే వివాహం జరుగుతుందని, వివాహం వాయిదా పడడానికి గల అసలు కారణాలను ఆమె వెల్లడించారు.
సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌పై మోసం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ వివాదంపై ఆయన తల్లి అమిత ముచ్చల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి వాయిదా వెనుక పలాష్ మోసం చేశాడనే వార్తల్లో నిజం లేదని, అంతా అనుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
అమిత ముచ్చల్ మాట్లాడుతూ.. రూమర్ల కారణంగా తమ కుమారుడు పలాష్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని, అతని ఆరోగ్యం కూడా క్షీణించిందని తెలిపారు. “హల్దీ ఫంక్షన్ జరిగినప్పటి నుంచి మేము అతనిని బయటకు పోనివ్వలేదు. అతను ఏడుస్తున్నాడు. అతని ఆరోగ్యం క్షీణించింది. అతన్ని నాలుగు గంటల పాటు ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది. ఐవీ డ్రిప్ పెట్టారు, ఈసీజీ, ఇతర పరీక్షలు చేశారు. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ అతను చాలా ఒత్తిడిలో ఉన్నాడు” అని వివరించారు.
స్మృతి మంధాన తండ్రికి ఆకస్మికంగా అనారోగ్యం కలగడం వల్లే పెళ్లి వాయిదా పడిందని అమిత ముచ్చల్ వెల్లడించారు. ఈ విషయంలో పలాష్ నిర్ణయాన్ని ఆమె ప్రశంసించారు. “అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. త్వరలోనే వారి పెళ్లి కూడా జరుగుతుంది. మా అబ్బాయికి స్మృతి తండ్రితో చాలా మంచి అనుబంధం ఉంది. అతను స్మృతి కంటే స్మృతి తండ్రికే ఎక్కువ సన్నిహితుడు. అందుకే ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, స్మృతి చెప్పకముందే పెళ్లిని వాయిదా వేయాలని పలాష్ నిర్ణయించుకున్నాడు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి జరగదని పలాష్ చెప్పాడు. ఇప్పుడు స్మృతి తండ్రి కోలుకుంటున్నారు” అని అమిత ముచ్చల్ తెలిపారు.
అలాగే, స్మృతి, పలాష్ ఇద్దరూ ప్రస్తుత పరిస్థితి గురించి చాలా ఆందోళన చెందుతున్నారని, అయితే తన కుమారుడు త్వరలోనే తన వధువును ఇంటికి తీసుకురావాలని ఆశిస్తున్నాడని ఆమె తెలిపారు. స్మృతిని స్వాగతించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని కూడా ఆమె వెల్లడించారు. కాగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధాన తండ్రి ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే స్మృతి, పలాష్ వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




