Champions Trophy: పాకిస్థాన్‌ అప్పుడే ఇంటికి పోలేదు.. ఇంకా సెమీస్‌ ఛాన్స్‌ బతికే ఉంది! ఇండియాతో ఫైనల్‌ ఆడాలంటే ఇలా జరగాలి

పాకిస్థాన్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ చేరే అవకాశాలను ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇండియాపై ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు సెమీస్‌ చేరాలంటే బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌లు, పాకిస్థాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఫలితాలు, ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఫలితాలు కీలకం. రన్ రేట్ ఆధారంగా సెమీస్ చేరే ఛాన్స్ ఉంది. అది ఎలాగంటే..

Champions Trophy: పాకిస్థాన్‌ అప్పుడే ఇంటికి పోలేదు.. ఇంకా సెమీస్‌ ఛాన్స్‌ బతికే ఉంది! ఇండియాతో ఫైనల్‌ ఆడాలంటే ఇలా జరగాలి
Pakistan Cricket Team

Updated on: Feb 24, 2025 | 8:46 AM

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌.. టోర్నీ నుంచి నిష్క్రమించే తొలి టీమ్‌గా నిలిచిందంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఆదివారం టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమితో పాకిస్థాన్‌కు సెమీస్‌ అవకాశం సంక్లిష్టంగా మారిన మాట వాస్తవమే కానీ, పూర్తిగా అయితే వారికి సెమీస్‌ డోర్లు మూసుకుపోలేదు. ఇంకా వారికి సెమీస్‌ చేరే ఛాన్స్‌ ఉంది. అదేంటి ఒక్క మ్యాచ్‌ ఓడినా ఇంటికే అని ధోని ఒకవైపు యాడ్‌లో చెబుతుంటే.. రెండో మ్యాచ్‌లు వరుసగా ఓడినా ఇంకా పాక్‌కు ఛాన్స్‌ ఉందంటున్నారు అని కన్ప్యూజ్‌ కాకండి. ప్రాక్టికల్‌గా పాకిస్థాన్‌ ఇంకా సెమీస్‌ ఛాన్స్‌ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. గ్రూప్‌లో ఇండియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్న విషయం తెలిసిందే.

గ్రూప్ స్టేజ్లో ఇండియా, పాక్‌ రెండేసి మ్యాచ్‌లు, కివీస్‌, బంగ్లా ఒక్కో మ్యాచ్‌లు ఆడేశాయి. ఇండియా రెండు విజయాలు సాధించి 4 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. రెండో ప్లేస్‌లో న్యూజిలాండ్‌ ఒక విజయం 2 పాయింట్లతో ఉంది, మూడో ప్లేస్లో బంగ్లాదేశ్‌, చివరి స్థానంలో పాకిస్థాన్‌ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌ సెమీస్‌ చేరాలంటే.. ఈ రోజు(ఫిబ్రవరి 24, సోమవారం) న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ గెలవాలి, అలాగే ఫిబ్రవరి 27, గురువారం నాడు బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ భారీ తేడాతో గెలవాలి.. చివరిగా మార్చి 2 ఆదివారం రోజు న్యూజిలాండ్‌పై ఇండియా భారీ తేడాతో గెలవాలి. ఈ మూడు మ్యాచ్‌ ఫలితాలు పైన చెప్పుకున్న విధంగా వస్తే.. ఇండియా 6 పాయింట్లతో తొలి స్థానంతో సెమీస్‌కు వెళ్తుంది. మిగిలిన మూడు జట్లు రెండేసి పాయింట్లతో ఉంటాయి. మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు రెండో స్థానంలో నిలిచి ఇండియాతో పాటు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. పాకిస్థాన్‌ రెండో స్థానంలో నిలవాలంటే.. కివీస్‌పై బంగ్లా, ఇండియా.. బంగ్లాపై పాక్‌ భారీ తేడాతో విజయం సాధించాలి.

బంగ్లాపై పాక్‌, న్యూజిలాండ్‌పై ఇండియా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. న్యూజిలాండ్‌పై బంగ్లా గెలవడం కష్టమే. ఈ రోజు జరిగే బంగ్లాదేశ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగిన బంగ్లాదేశ్‌ గెలిస్తే.. పాకిస్థాన్‌ ఆశలు పెట్టుకోచ్చు. ఒక వేళ న్యూజిలాండ్‌ గెలిస్తే మాత్రం.. ఏ ఈక్వేషన్స్‌తో సంబంధం లేకుండా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 నుంచి నిష్క్రమించే తొలి టీమ్‌గా పాకిస్థాన్‌ నిలుస్తుంది. బంగ్లాతో వాళ్ల మ్యాచ్‌ నామమాత్రంగా మారుతుంది. ఒక వేళ అన్ని పాకిస్థాన్‌కు అనుకూలంగా జరిగి.. సెమీస్‌ చేరి అక్కడ కూడా విజయం సాధిస్తే, మరోవైపు ఇండియా సెమీస్‌లో గెలిస్తే.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ జరుగుతుంది. ఈ ఫైనల్‌ కోసమైనా.. పాకిస్థాన్‌ సెమీస్‌, ఫైనల్‌ చేరాలని భారత అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.