PAK vs BAN: పాక్ జట్టుకు ఇచ్చి పడేసిన బంగ్లా.. 10 వికెట్ల తేడాతో సరికొత్త చరిత్ర

|

Aug 25, 2024 | 4:06 PM

PAK vs BAN: పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వదేశంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైంది.

PAK vs BAN: పాక్ జట్టుకు ఇచ్చి పడేసిన బంగ్లా.. 10 వికెట్ల తేడాతో సరికొత్త చరిత్ర
Pak Vs Ban 1st Test
Follow us on

PAK vs BAN: పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వదేశంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసిన పాక్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లా జట్టుకు కేవలం 30 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్‌ ఎలాంటి వికెట్‌ కోల్పోకుండా విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

రెండు జట్ల నుంచి భారీ స్కోర్..

ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందే రావల్పిండిలో తొలి టెస్టుకు పేసర్లకు సహకరించేందుకు పీసీబీ గ్రీన్ పిచ్‌ను సిద్ధం చేసిందని వార్తలు వచ్చాయి. దీనికి తోడు పీసీబీ తొలి టెస్టుకు తమ జట్టులో స్పిన్నర్లకు అవకాశం ఇవ్వలేదు. అదృష్టవశాత్తూ, టాస్ కూడా పాకిస్తాన్‌కు అనుకూలంగా పడింది. ఇలా గ్రీన్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు బంగ్లాదేశ్ జట్టును ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో బరిలోకి దిగింది. అయితే, తొలిరోజు ఆట ముగిసేసరికి పిచ్ స్వరూపమే మారిపోయింది. దీంతో పీసీబీ లెక్కలు తలకిందులయ్యాయి. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 448 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ కూడా 565 పరుగుల భారీ స్కోరు సాధించింది.

బంగ్లాకు అండగా స్పిన్నర్లు..

పేసర్లకు సహకరించేలా పిచ్‌ను సిద్ధం చేసి రంగంలోకి దించిన పాక్ జట్టుకు పిచ్ బిగ్ షాక్ ఇచ్చింది. స్పిన్‌, స్పీడ్‌ మేళవింపుతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ బ్యాటింగ్‌ వెన్నెముకను చిత్తుగా చీల్చివేసింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్ల ధాటికి పాకిస్థాన్ కేవలం 146 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌లో ఇద్దరు స్పిన్నర్లు మెహదీ హసన్ మిరాజ్ 4 వికెట్లు తీయగా, అనుభవజ్ఞుడైన షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు తీయగలిగాడు.

మ్యాచ్ పరిస్థితి..

ఇరుజట్ల ప్రదర్శన గురించి మాట్లాడితే… తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ తరపున సౌద్ షకీల్ 141 పరుగులు చేయగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ 171 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల రిజ్వాన్ తొలి డబుల్ సెంచరీకి దూరమయ్యాడు. చివరకు ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 448 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెటరన్ ముష్ఫికర్ రహీమ్ 191 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడగా, మోమినుల్ హక్, లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్ తలా హాఫ్ సెంచరీలు ఆడారు.

దీంతో బంగ్లా జట్టు 565 పరుగులకు ఆలౌటయి తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో రిజ్వాన్‌ హాఫ్‌ సెంచరీతో పాక్‌ ఇన్నింగ్స్‌లో రాణించడం మినహా మిగతా వారి నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. చివరకు ఆ జట్టు 146 పరుగులకే ఆలౌటయి బంగ్లా జట్టుకు 30 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా విజయభేరీ మోగించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..