SRH vs MI: ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. రోహిత్ క్రీజులో కుదురుకుంటున్న సమయంలోనే రషీద్ ఖాన్ ఓవర్లో మహమ్మద్ నబి చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు.
32 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్స్‌లు, 11ఫోర్లు ఉన్నాయి. ఉమ్రాన్ మాలిక్ వేసిన పదో ఓవర్లో ఇషాన్ దూకుడుకు తెరపడింది. కీపర్ వృద్దిమాన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ చివరి వరకు సిక్సులు, ఫోర్లతో అలరించాడు. 40 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్స్‌లు 13 ఫోర్లు ఉన్నాయి. మిగతావారు పెద్దగా రాణించలేదు. దీంతో ముంబై 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్ తలో రెండు, ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీశారు.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభిన హైదరాబాద్‌కి ఓపెనర్లు జాసన్ రాయ్, అభిషేక్ శర్మ శుభారంభానిచ్చారు. జాసన్ రాయ్ 34 పరుగులు, అభిషేక్ శర్మ 33 పరుగులతో ఆకట్టుకున్నారు. తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే చివరి వరకు పోరాడాడు. ఈ క్రమంలో 41 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 2సిక్స్‌లు ఉన్నాయి. మిగతా బ్యాట్స్‌మెన్లలో ప్రియమ్ గార్గ్ 29 పరుగులు మినహాయించి పెద్దగా ఎవరు రాణించలేదు. దీంతో హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా 2, నాథన్ కౌల్టర్ 2, జేమ్స్ నీషమ్ 2 వికెట్ల చొప్పున సాధించారు.