
IPL 2026 CSK : స్టేడియం అంతా ఎప్పుడెప్పుడు ‘ధోనీ.. ధోనీ..’ అని మార్మోగిపోతుందా అని ఎదురుచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు షాకింగ్ న్యూస్. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎంఎస్ ధోనీ రీ-ఎంట్రీ మరోసారి వాయిదా పడింది. మోకాలి నొప్పితో గత మూడు వారాలుగా ఆటకు దూరంగా ఉన్న ధోనీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని అందరూ ఆశించారు. కానీ, తాజా నివేదికల ప్రకారం అతడు ఆ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో చెన్నై జట్టులో ఆందోళన మొదలైంది.
ధోనీ రాక ఎప్పుడు?
ఐపీఎల్ ప్రారంభం నుంచి మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న ధోనీ, నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే నెట్స్‌లో తేలికపాటి బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికీ, మ్యాచ్ ఆడే స్థాయి ఫిట్‌నెస్ ఇంకా రాలేదని వైద్యులు భావిస్తున్నారు. ఏప్రిల్ 18న సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు ఆడతాడని అందరూ అనుకున్నారు కానీ, క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం ధోనీ ఇప్పుడు ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. అంటే అభిమానులు మరో వారం రోజులు ఆగక తప్పదు.
సీఎస్‌కేకు వరుస కష్టాలు
కేవలం ధోనీ లేకపోవడమే కాదు, చెన్నై జట్టుకు బౌలింగ్‌లో కూడా గట్టి షాక్ తగిలింది. స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు 8వ స్థానంలో ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచి, మూడు ఓటములతో కునారిల్లుతోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో జట్టును నడిపించడానికి ధోనీ వంటి సీనియర్ ఆటగాడు లేకపోవడం చెన్నై విజయావకాశాలను దెబ్బతీస్తోంది.
ఎస్‌ఆర్‌హెచ్‌కు అడ్వాంటేజ్?
ఒకవైపు చెన్నై కష్టాల్లో ఉంటే, మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తీపి కబురు అందింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఏప్రిల్ 18న జరిగే పోరులో హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది. ధోనీ లేని చెన్నై బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయడం ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లకు సులభం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చెన్నై తన ఆటతీరును మార్చుకోకపోతే ప్లే-ఆఫ్స్ రేసు నుంచి త్వరగానే తప్పుకోవాల్సి వస్తుంది.
🚨 NO MS DHONI AGAINST SRH. 🚨
– MS Dhoni has resumed light batting in nets, but unlikely to play against SRH. (Cricbuzz). pic.twitter.com/vNQZH4k91d
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2026
అభిమానుల ఆవేదన
ధోనీని స్టేడియంలో చూడటమే పండుగలా భావించే ఫ్యాన్స్, ఈ వార్తతో డీలా పడ్డారు. సోషల్ మీడియాలో తలా రీ-ఎంట్రీ గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో జరిగే ఎల్ క్లాసికో మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌ను చూడాలని అందరూ కోరుకుంటున్నారు. అప్పటివరకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై జట్టు ఏ మేరకు పోరాడుతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..