టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ ఇటీవల తన కుమార్తె ఐరాను కలిశాడు. భార్య హాసిన్ జహాన్ తో విడిపోయిన షమీ చాలా రోజుల తర్వాత తన గారాల పట్టిని కలిసి ఎమోషనల్ అయ్యాడు. ఇద్దరూ కలిసి సరదాగా షాపింగ్ కూడా చేశారు. ‘చాలా కాలం తర్వాత నా కూతురును చూశాను. తనను చూసినప్పుడు సమయం నిలిచిపోయింది. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను’ అని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌కి కేవలం గంట వ్యవధిలో 1.60 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అయితే షమీ- ఐరాలు కలవడంపై మాజీ భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. ‘ఇది కేవలం షో ఆఫ్ కోసమే.. నా కూతురు పాస్‌పోర్ట్ గడువు ముగిసింది.. కొత్త పాస్‌పోర్ట్‌కి షమీ సంతకం కావాలి.. అందుకే తండ్రిని కలవడానికి వెళ్లింది. అయితే అక్కడ షమీ సంతకం చేయలేదు.. తన కూతురితో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. అక్కడ తాను ఎండార్స్ చేసే బ్రాండెడ్ షూస్, బట్టలు మాత్రమే కొన్నాడు. ఆ కంపెనీకి చెందిన వస్తువులు ఏవీ కొన్నా వాటికి షమీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకే ఆ షాపింగ్ మాల్ కు తీసుకెళ్లాడు. కానీ నా కూతురు గిటార్, కెమెరా కావాలని అడిగింది. కానీ ఆ వస్తువులను కొనివ్వలేదు’ అని హసిన్ జహాన్ చెప్పుకొచ్చింది.
‘షమీ నా కూతురి గురించి అసలు పట్టించుకోడు. షమీ తనతో మాత్రమే బిజీగా ఉంటున్నాడు. ఒక నెల క్రితమే ఐరాను కలిశాడు. కానీ అప్పుడు ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఇప్పుడు పోస్టు చేయడానికి గల కారణాలేంటో అతనికే తెలియాలి. బహుశా ఇప్పుడు పోస్ట్ చేయడానికి అతని దగ్గర ఏమీ లేదనుకుంటాను. అందుకే ఈ వీడియోను అప్‌లోడ్ చేసాడు’ అని వెటకారంగా మాట్లాడింది షమీ భార్య.
హసీనా జహాన్ గతంలో మహ్మద్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై షమీ స్పందిస్తూ అలా చేయాల్సి వస్తే అంత కంటే ముందే తాను ప్రాణాలు వదిలేస్తానని చెప్పుకొచ్చాడు. మహ్మద్ షమీ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. త్వరలో మళ్లీ క్రికెట్‌లోకి రానున్నాడు. రంజీ ట్రోఫీ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో షమీ ఆడే అవకాశం ఉంది.