
MI vs CSK : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఎల్-క్లాసికో సమరం పరుగుల వరద పారిస్తోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం సంజూ శాంసన్ వీరవిహారమే. ముంబై బౌలర్లను తన బ్యాట్‌తో చెడుగుడు ఆడుకున్నాడు సంజూ శాంసన్. ఈ సీజన్లో రెండో సెంచరీ నమోదు చేసి 101 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సంజూ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు కొండంత స్కోరును అందించాడు.
నేటి మ్యాచ్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. ఓపెనర్‌గా వచ్చిన సంజూ, ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది ఆయన ఐపీఎల్ కెరీర్‌లో 27వ హాఫ్ సెంచరీ. సెంచరీ దిశగా దూసుకుపోతున్న క్రమంలో కీలక వికెట్లు పడుతున్నా వెనక్కు తగ్గలేదు. ఆయన చివరి వరకు క్రీజులో ఉండి 54 బంతుల్లో 101 పరుగుల చేసి జట్టు స్కోరును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. సంజూ క్లాస్ షాట్లు చూసి వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది.
చెన్నై ఇన్నింగ్స్ ఆరంభంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (22) దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అల్లా ఘజన్ ఫర్ వేసిన మూడో ఓవర్లో ఆయన అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (14), శివమ్ దూబే (5) త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే మరోవైపు సంజూ శాంసన్ మాత్రం ముంబై బౌలర్లను నిర్ధాక్షిణ్యంగా బాదేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ (22), కార్తీక్ శర్మ (18) మెరుపులు మెరిపించి సంజూకు సహకరించారు. చివర్లో జేమీ ఓవర్టన్ 7 బంతుల్లో 15 పరుగులు చేసి అశ్విని కుమార్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండో ఓవర్లోనే 19 పరుగులు ఇచ్చి భారీగా మూల్యం చెల్లించుకున్నాడు. అయితే బుమ్రా ఎప్పటిలాగే పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఒక వికెట్ పడగొట్టాడు. అశ్విని కుమార్ 2 వికెట్లతో రాణించినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అల్లా ఘజన్ ఫర్, మిచెల్ శాంట్నర్ తలో వికెట్ తీశారు. ముంబై ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు జరగడం చెన్నైకి కలిసొచ్చింది.
చెన్నై నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ముంబై బ్యాటర్లు అద్భుతం చేయాల్సిందే. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ముంబై తరపున క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇన్-ఫామ్ బ్యాటర్ తిలక్ వర్మ ఏ స్థాయిలో రాణిస్తారనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ముంబైకి ప్రతి ఓవర్లో 10.4 సగటు పరుగులు అవసరం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..