MI vs CSK : 103 పరుగుల తేడాతో ముంబై విలవిల.. చెన్నై చేతిలో ఘోర ఓటమికి అసలు కారణం ఇదే

MI vs CSK : చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల ఘోర ఓటమిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించారు. పరుగుల పరంగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో ఎదుర్కొన్న అతిపెద్ద ఓటమి ఇదే. పవర్‌ప్లే వైఫల్యమే తమ కొంపముంచిందని హార్దిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

MI vs CSK : 103 పరుగుల తేడాతో ముంబై విలవిల.. చెన్నై చేతిలో ఘోర ఓటమికి అసలు కారణం ఇదే
Hardik Pandya

Updated on: Apr 24, 2026 | 8:54 AM

MI vs CSK : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో 103 పరుగుల తేడాతో ముంబై ఎదుర్కొన్న పరాజయం కేవలం ఓటమి మాత్రమే కాదు, ఆ జట్టు చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఘోర పరాజయం తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన మనసులోని ఆవేదనను, ఓటమికి గల అసలు కారణాలను నిర్మొహమాటంగా బయటపెట్టారు. మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించారు. “208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే పవర్‌ప్లే చాలా కీలకం. కానీ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో జట్టుపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. దాని నుంచి మేము కోలుకోలేకపోయాము. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కాసేపు ఆశలు చిగురింపజేసినా, చివరి ఆరు వికెట్లు కేవలం 20 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం దారుణం” అని హార్దిక్ పేర్కొన్నారు.

పిచ్ ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని అడిగిన ప్రశ్నకు హార్దిక్ చాలా స్పష్టంగా సమాధానమిచ్చారు. “ఇదే పిచ్‌పై సీఎస్కే బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా సంజూ శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ అసాధారణం. వాళ్ళ టీమ్‌లో ఒకరు సెంచరీ చేస్తే, మిగిలిన వాళ్ళు కూడా మంచిగా పరుగులు జోడించారు. మేము మాత్రం బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాము. మా బ్యాటింగ్ పూర్తిగా తప్పింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పరుగుల పరంగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో ఎదుర్కొన్న అతిపెద్ద ఓటమి ఇదే. 207 పరుగులు చేసిన సీఎస్కే, ముంబైని కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేసింది. అకీల్ హొస్సేన్ తన స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు తీసి ముంబై నడ్డి విరిచాడు. ఓపెనర్లు డానిష్ మలేవార్, క్వింటన్ డికాక్, నమన్ ధీర్ దారుణంగా విఫలమవడం ముంబై అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే గెలిచిన ముంబైకి ప్లేఆఫ్ దారులు క్లిష్టంగా మారాయి. “మేము ఎక్కడ తప్పు చేశామో కూర్చుని మాట్లాడుకుంటాం. వచ్చే మ్యాచ్‌కు ముందు మాకు కొంచెం సమయం ఉంది. తప్పకుండా కొన్ని మార్పులు చేసుకుని బలంగా తిరిగి వస్తాం” అని హార్దిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబై తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 29న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడాల్సి ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us