
Vaibhav Sooryavanshi Records: ఐపీఎల్ వేదికగా పరుగుల సునామీ సృష్టించి, ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న భారత సరికొత్త బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. జూన్ 26 నుంచి బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ ద్వారా ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ టీమిండియా క్యాప్ అందుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్న 5 భారీ రికార్డులు ఇవే.
వయసు కేవలం 15 ఏళ్లే అయినా, దేశవాళీ క్రికెట్ నుంచి మొన్నటి ఐపీఎల్ వరకు వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఐపీఎల్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. జూన్ 26న సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగబోయే పోరు కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వైభవ్ ఆటను ప్రత్యక్షంగా చూడటం కోసం ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఏకంగా మైదానంలో తాత్కాలిక స్టాండ్‌లను నిర్మిస్తోంది అంటేనే ఈ కుర్రాడి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రికార్డు ఇప్పటివరకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. అయితే, ఇటీవల ఐపీఎల్ సమయంలోనే తన 15వ పుట్టినరోజు జరుపుకున్న వైభవ్, ఐర్లాండ్ సిరీస్‌లో బరిలోకి దిగితే సచిన్ పేరిట ఉన్న మూడు దశాబ్దాల నాటి రికార్డు కనుమరుగవుతుంది. భారతదేశం తరఫున అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టిస్తాడు.
టీ20 అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ (4 సిక్సర్లు) రికార్డు సృష్టించాడు. క్లీన్ హిట్టింగ్‌కు మారుపేరైన వైభవ్ సూర్యవంశీ, తన తొలి మ్యాచ్‌లోనే క్రీజులో సెట్ అయి ఐదు సిక్సర్లు బాదితే, ఇషాన్ కిషన్ రికార్డును అధిగమించి సరికొత్త మైలురాయిని అందుకుంటాడు.
2011లో ఇంగ్లాండ్‌పై టీ20 అరంగేట్రం చేసిన సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే 39 బంతుల్లో 61 పరుగులు చేసి, ఇప్పటికీ భారత్ తరఫున అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన రికార్డును తన వద్దే ఉంచుకున్నాడు. ఒకవేళ ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వైభవ్ 62 పరుగులు చేయగలిగితే, 15 ఏళ్ల వయసులోనే రహానే రికార్డును కూడా తుడిచేస్తాడు.
భారత క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ గడ్డపై టీ20 అరంగేట్రం చేసిన సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్, ప్రసిద్ధ్ కృష్ణ, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లెవరూ తమ తొలి మ్యాచ్‌లో కనీసం ఒక్క పరుగు కూడా చేయలేదు. కాబట్టి, ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక పరుగు చేసినా, ఐర్లాండ్ గడ్డపై అరంగేట్రం చేసి పరుగుల ఖాతా తెరిచిన తొలి భారతీయ బ్యాటర్‌గా నిలుస్తాడు.
ప్రస్తుతం ఐర్లాండ్ గడ్డపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ (97 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ కనుక ఓపెనర్‌గా బరిలోకి దిగి 98 పరుగులు సాధిస్తే, ఏకంగా రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టి ఐర్లాండ్‌లో అత్యంత విజయవంతమైన భారత ఓపెనర్‌గా నిలుస్తాడు.