IPL 2025 Final: 18 ఏళ్ల తర్వాత నెరవేరిన ఆర్సీబీ కల.. రజత్ పాటిదార్‌ను అభినందించిన మహానార్యమన్ సింధియా
అభిమానుల ఆశ నెరవేరింది. ఎన్నో ఏళ్ల విరాట్ కొహ్లి కల సాకారమైంది. ఎట్టకేలకు ఐపీఎల్ టోర్నీ ఆర్సీబీ సొంతమైంది. ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీ లుక్కేయండి.

ఆర్సీబీ ఫ్యాన్స్17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. సుమారు 18 ఏళ్ల కలకు తెరపడటంతో ఆర్సీబీ ఫ్యాన్స్, ప్రముఖులు సంతోషంలో మునిగితేలారు.
ఇదిలా ఉంటే బెంగళూరు విజయంపై మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ చైర్మన్ మహానార్యమన్ సింధియా ట్వీట్ చేశారు. కెప్టెన్ రజత్ పాటిదార్‌ను పొగడ్తలతో ముంచెత్తడమే కాదు.. బెంగళూరు జట్టును అభినందించారు. GDCA వైస్ ప్రెసిడెంట్, మధ్యప్రదేశ్ క్రికెట్ లీగ్ చైర్మన్ మహానార్యమన్ సింధియా తన ట్వీట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. ‘IPL కప్ గెలవడానికి బెంగళూరుకు 18 సంవత్సరాలు పట్టిందని.. అలాగే ఆ కప్పును బెంగళూరు కోసం ఓ మధ్యప్రదేశ్ యోధుడు సాధించాడు.! రజత్ పాటిదార్ నువ్వు నిజమైన నాయకుడు! కంగ్రాట్స్ బెంగళూరు జట్టు!’
బెంగళూరు విజయానికి నేరుగా మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ కారణమయ్యాడని మధ్యప్రదేశ్ క్రికెట్ లీగ్ చైర్మన్ మహానార్యమన్ సింధియా పేర్కొన్నారు. ఈ సంవత్సరం MPLలో గ్వాలియర్ చీతా జట్టు తరపున రజత్ పాటిదార్ ఆడబోతున్నాడు. ఈ ఏడాది 7 పురుషుల జట్లు, 3 మహిళా జట్లు MPL లీగ్‌లో ఆడబోతున్నాయి. MPL జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. అన్ని మ్యాచ్‌లు గ్వాలియర్‌లోని శ్రీమంత్ మాధవరావు సింధియా స్టేడియంలో జరగనున్నాయి.
ఇక ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిచిన వెంటనే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2008లో తొలి సీజన్ నుంచీ ఒకే జట్టులో కొనసాగుతూ, కెప్టెన్‌గాను వ్యవహరించినా ఇప్పటిదాకా టైటిల్ గెలవలేకపోయాడు. చివరకు ఆర్‌సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోవడంతో కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. స్టేడియంలో జట్టు సభ్యులంతా కోహ్లీ చుట్టూ చేరి విజయోత్సవాలు నిర్వహించారు. అభిమానులు కూడా ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఈ విజయంతో కింగ్ కోహ్లీతో పాటు ఆర్సీబీ కల కూడా నెరవేరింది.




