Team India: కేవలం 117 నిమిషాల్లో.. టీమిండియా తరపున టెస్టుల్లో తొలి సెంచరీ.. ఆ ప్లేయర్ ఎవరంటే?

|

Dec 17, 2022 | 1:33 PM

భారత్ తరపున తొలి టెస్టు సెంచరీ ఎప్పుడు, ఎవరు సాధించారో మీకు తెలుసా? సరిగ్గా ఇదే ఈ రోజున..

Team India: కేవలం 117 నిమిషాల్లో.. టీమిండియా తరపున టెస్టుల్లో తొలి సెంచరీ.. ఆ ప్లేయర్ ఎవరంటే?
Cricket
Follow us on

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్(100) అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ(72) రెండో స్థానంలో ఉన్నాడు. అయితే భారత్ తరపున తొలి టెస్టు సెంచరీ ఎప్పుడు, ఎవరు సాధించారో మీకు తెలుసా? సరిగ్గా ఇదే ఈ రోజున అంటే 1933, డిసెంబర్ 17న లాలా అమర్‌నాథ్ టెస్టుల్లో టీమిండియా తరపున మొదట సెంచరీ చేశాడు.

1933లో ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లాలా అమర్‌నాథ్ తొలి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. డిసెంబరు 15న మ్యాచ్ ప్రారంభం కాగా, మ్యాచ్ మూడో రోజు అమర్‌నాథ్ సెంచరీ సాధించి.. టెస్ట్‌ల్లో టీమిండియా తరపున తొలి శతకాన్ని నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంత అద్భుతమైన ఫీట్ అతడు సాధించినప్పటికీ.. తన జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 219 పరుగులకు ఆలౌట్ అయింది. దానికి సమాధానంగా ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు సాధించి 219 పరుగుల ఆధిక్యాన్ని పొందింది.

ఇక భారత జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో మూడవ రోజు, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు అమర్‌నాథ్ క్రీజులో వచ్చాడు. కేవలం 117 నిమిషాల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 185 నిమిషాలు బ్యాటింగ్ చేసి 118 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు ఉన్నాయి. దీంతో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా అమర్నాద్ రికార్డు సృష్టించాడు. అతడు జట్టు కెప్టెన్ సికె నాయుడు(67)తో కలిసి 186 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులు ఆలౌట్ అయింది. ఇక మ్యాచ్ గెలిచేందుకు ఇంగ్లాండ్‌కు కేవలం 40 పరుగులు అవసరమయ్యాయి. ఈ లక్ష్యాన్ని వారు సునాయాసంగా అందుకోగలిగారు.