
జాక్వెస్ కలిస్.. క్రికెట్ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. సచిన్ తరం నాటి కాలానికి చెందిన ఈ స్టార్ క్రికెటర్ తన ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో దక్షిణాఫ్రికా జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా కేవలం క్రికెట్‌నే ప్రేమించి దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన ఆటతీరు, ప్రవర్తనతో భారతీయ అభిమానుల మనసులు కూడా గెల్చుకున్నాడు. క్రికెటర్‌గా రిటైరయ్యాక కోచ్‌గా యువ క్రికెటర్లకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇలా ఆటగాడిగా, కోచ్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కలిస్ తాజాగా ఓ శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి అయినట్లు సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ షేర్ చేశాడు. తన భార్య పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని, భార్యా, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ తెలిపాడు. కాగా కలిస్ దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు.
కాగా కలిస్ ఐపీఎల్‌తోనూ మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 2008 నుంచి 2010 వరకు ఆడాడు. ఆ తర్వాత మూడేళ్లపాటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కతా జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు కలిస్. ధనాధన్ లీగ్‌లో మొత్తం 98 మ్యాచులు ఆడిన కలిస్ 28.55 సగటుతో 2,427 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 109.23 కావడం విశేషం. ఇందులో 17 అర్ధ సెంచరీలు ఉండగా.. అత్యధిక వ్యక్తిగత స్కోరు 89 పరుగులు. బౌలింగ్‌లోనూ 65 వికెట్లు తీసుకున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..