
Irfan Pathan Sensational Comments on Ms Dhoni: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. తన కెరీర్ పతనం వెనుక ధోనీ హస్తం ఉందని పఠాన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల మధ్య చర్చకు దారితీస్తున్నాయి. పఠాన్ ధోనీ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు ధోనీని ఉద్దేశించే అన్నాడని స్పష్టంగా తెలుస్తోంది.
2009లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఇర్ఫాన్ పఠాన్, తన సోదరుడు యూసుఫ్ పఠాన్‌తో కలిసి జట్టుకు ఒక విజయాన్ని అందించారు. ఆ మ్యాచ్‌లో 28 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టును గెలిపించారు. అలాంటి కీలక మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన తర్వాత కూడా పఠాన్‌ను జట్టు నుంచి తొలగించారు. ఈ విషయంపై ఆయన అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను అడిగారు. కిర్‌స్టెన్ రెండు కారణాలు చెప్పారని పఠాన్ వెల్లడించాడు.
కెప్టెన్ నిర్ణయం: “కొన్ని విషయాలు నా చేతుల్లో లేవు” అని కిర్‌స్టెన్ చెప్పారని, తుది జట్టు ఎంపిక కెప్టెన్ చేతుల్లో ఉంటుందని పఠాన్ అన్నాడు. ఆ సమయంలో కెప్టెన్‌గా ధోనీ ఉన్నారని, కాబట్టి నిర్ణయం ధోనీదే అని పరోక్షంగా పేర్కొన్నాడు.
బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అవసరం: జట్టుకు ఏడవ స్థానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అవసరమని జట్టు భావిస్తోందని కిర్‌స్టెన్ చెప్పారని పఠాన్ తెలిపాడు. తన సోదరుడు యూసుఫ్ పఠాన్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కాగా, తాను బౌలింగ్ ఆల్‌రౌండర్‌నని, అందుకే జట్టులో ఇద్దరిలో ఒకరికే అవకాశం ఉందని పఠాన్ వివరించారు.
‘నాకు హుక్కా పెట్టే అలవాటు లేదు’
ఈ వ్యాఖ్యలతో పాటు, ఇర్ఫాన్ పఠాన్ ఒక కీలకమైన వాక్యాన్ని జోడించారు. “ఎవరి గదిలోనో హుక్కా ఏర్పాటు చేయడం, దాని గురించి మాట్లాడటం నాకు అలవాటు లేదు. ఈ విషయం అందరికీ తెలుసు.” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ధోనీని లక్ష్యంగా చేసుకుని చేసినట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే, గతంలో ధోనీ హుక్కా తాగుతున్న వీడియోలు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జార్జ్ బెయిలీ కూడా ఒక ఇంటర్వ్యూలో ధోనీ సహచర ఆటగాళ్లతో అప్పుడప్పుడు హుక్కా తాగుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో, హుక్కా తాగే ఆటగాళ్లకే ధోనీ జట్టులో ప్రాధాన్యత ఇచ్చేవారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో ఊపందుకుంది.
ఈ వ్యాఖ్యల వల్ల ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ అద్భుతంగా ఉన్న సమయంలోనే ముగిసిపోయిందని, మంచి ప్రదర్శన చేసినా జట్టులో చోటు దక్కలేదని అభిమానులు అంటున్నారు. పఠాన్ 2003లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి, 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా గెలుచుకున్నారు. కానీ, 2009 తర్వాత అతని కెరీర్ క్రమంగా క్షీణించి, 2020లో రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ పాత వ్యాఖ్యలు ఇప్పుడు తిరిగి వైరల్ కావడంతో క్రికెట్ వర్గాల్లో మళ్ళీ చర్చ మొదలైంది.
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇర్ఫాన్ పఠాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచ కప్ గెలవడంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత భారత టీ20 జట్టులో అతనికి పెద్దగా అవకాశం రాలేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..