T20 World Cup:
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2022 లో చిన్న జట్లు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే విండీస్, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లకు ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. తాజాగా ఆ జట్లు బౌలర్ జాషువా లిటిల్ న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలరైన అతను అడిలైడ్ ఓవల్‌లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఇది రెండో హ్యాట్రిక్. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో జాషువా లిటిల్ హ్యాట్రిక్ సాధించాడు. అతను కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్ మరియు మిచెల్ సాంట్నర్‌లను వరుసగా మూడు బంతుల్లో అవుట్ చేశాడు.ఈ మ్యాచ్ ఆసాంతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు జాషువా లిటిల్. ఓవైపు విలియమ్సన్, ఫిన్ అలెన్ మెరుపు వేగంతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జాషువా 4 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 5.5 పరుగులు మాత్రమే.
కాగా జాషువా లిటిల్ 19వ ఓవర్ రెండో బంతికి విలియమ్సన్‌ను ఔట్ చేశాడు. విలియమ్సన్ డీప్ స్క్వేర్ లెగ్ వద్ద డెలానీకి క్యాచ్ ఇచ్చాడు. దీని తర్వాత లిటిల్ తొలి బంతికే జేమ్స్ నీషమ్‌ను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఆ తర్వాత మిచెల్ సాంట్నర్ కూడా తొలి బంతికే ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆరుగురు బౌలర్లు హ్యాట్రిక్ సాధించారు. అదే సమయంలో, ఐర్లాండ్‌కు చెందిన ఇద్దరు బౌలర్లు హ్యాట్రిక్ సాధించారు. లిటిల్ కంటే ముందు, గతేడాది అబుదాబిలో నెదర్లాండ్స్‌పై కర్టిస్ కాన్ఫెర్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ టీ20 ప్రపంచ కప్ విషయానికొస్తే.. యూఏఈకి చెందిన కార్తీక్ మెయ్యప్పన్ గీలాంగ్‌లో శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించాడు.
ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే , అడిలైడ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 185 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 35 బంతుల్లో 61 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఫిన్ అలెన్ 18 బంతుల్లో 32 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 31 పరుగులు చేశాడు. ఆతర్వాత ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 35 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..