
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సీజన్ ఆరంభానికి ముందే పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆల్ రౌండర్ సామ్ కరణ్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు రాజస్థాన్ యాజమాన్యం శ్రీలంక వెటరన్ ఆటగాడు దాసున్ శనకను ఎంచుకుంది. వేలంలో అమ్ముడుపోని శనకను రూ. 2 కోట్ల ప్రాథమిక ధరతో రాయల్స్ ఒప్పందం చేసుకుంది. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పర్యవేక్షణలో శనక ఫినిషర్‌గా జట్టుకు సమతుల్యతను తీసుకురానున్నారు.
దాసున్ శనక ఈ ఏడాది పీఎస్ఎల్ వేలంలో లాహోర్ ఖలందర్స్ జట్టుకు రూ. 75 లక్షల పాకిస్థానీ రూపాయలకు (భారత కరెన్సీలో సుమారు రూ. 25 లక్షలు) అమ్ముడుపోయాడు. అయితే, ఐపీఎల్ నుంచి పిలుపు రావడంతో ఆయన పీఎస్ఎల్ ఒప్పందాన్ని కాదనుకున్నాడు. ఐపీఎల్ లో ఆయనకు రూ. 2 కోట్లు లభించనున్నాయి. అంటే పీఎస్ఎల్ లో లభించే మొత్తం కంటే సుమారు రూ. 1.75 కోట్లు అదనంగా ఆయనకు దక్కనున్నాయి. ఈ భారీ వ్యత్యాసమే ఆయన నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
దాసున్ శనక ఐపీఎల్ లోకి రావడం ఇది మూడోసారి కాగా, విశేషమేమిటంటే మూడు సార్లు కూడా ఆయన గాయపడిన ఆటగాళ్ల స్థానంలోనే ఎంట్రీ ఇచ్చాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ తరపున కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో ఆయన జట్టులో చేరాడు. అయితే గత సీజన్లలో ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరపున మెరుగైన ప్రదర్శన చేయాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు.
ఇప్పటికే జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ పీఎస్ఎల్ వదిలి కోల్‌కతా నైట్ రైడర్స్ లో చేరగా, ఇప్పుడు శనక కూడా అదే బాట పట్టారు. ఐపీఎల్ లో లభించే భారీ పారితోషికం, అంతర్జాతీయ గుర్తింపు కారణంగా ఆటగాళ్లు పీఎస్ఎల్ కు స్వస్తి పలుకుతున్నారు. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (PCB) తలనొప్పిగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..