
భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన తర్వాత, క్రికెట్ ప్రేమికుల దృష్టి ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌పై పడింది. మార్చి 28 నుంచి మొదలుకానున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ గురించి మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆసక్తికరమైన అంచనాలను పంచుకున్నారు. ఈసారి టైటిల్ రేసులో ఏ జట్లు ముందుంటాయి, వ్యక్తిగత అవార్డులు ఎవరు గెలుచుకుంటారనే దానిపై ఆయన స్పష్టతనిచ్చారు.
ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే అవకాశం సంజు శాంసన్ కే ఎక్కువగా ఉందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఇటీవల రాజస్థాన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి మారిన సంజు, వరల్డ్ కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌లో 321 పరుగులు చేయడమే కాకుండా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజు, అదే జోరును ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తాడని చోప్రా పేర్కొన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో, ముంబై ఇండియన్స్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా పర్పుల్ క్యాప్ రేసులో అందరికంటే ముందుంటాడని ఆయన జోస్యం చెప్పారు.
ఈ ఏడాది ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డును రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గెలుచుకునే అవకాశం ఉందని చోప్రా తెలిపారు. అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ యువ బ్యాటర్, ఐపీఎల్‌లో తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో కొత్త రికార్డులు సృష్టిస్తాడని విశ్లేషించారు.
అత్యంత ఉత్కంఠభరితమైన ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు గురించి మాట్లాడుతూ, ఆకాష్ చోప్రా నాలుగు జట్ల పేర్లను వెల్లడించారు. అతని విశ్లేషణ ప్రకారం ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) – డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగుపెట్టనున్నట్లు తెలిపారు.
ఈ నాలుగు జట్లు సెమీఫైనల్ బెర్త్‌లను దక్కించుకుంటాయని ఆయన అంచనా వేశారు. ఆశ్చర్యకరంగా చెన్నై, కోల్‌కతా వంటి బలమైన జట్లను ఆయన టాప్-4 జాబితాలో చేర్చకపోవడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..