IPL 2026 : ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. బౌలర్లకు ఇక పండగే.. బంతి మార్పుపై బీసీసీఐ కీలక నిర్ణయం
IPL 2026 : ఐపీఎల్ 2026లో బంతి మార్పుపై కొత్త రూల్ అమలులోకి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ టీమ్ 10 ఓవర్ల తర్వాత ఒకసారి బంతిని మార్చుకునే వీలుంటుంది. దీనివల్ల మంచు ప్రభావం తగ్గుతుంది. మ్యాచ్ మధ్యలో బంతి పరిస్థితి మరీ దారుణంగా తయారైందని అంపైర్లు భావిస్తే మార్చే అధికారం కలిగి ఉంటారు.

IPL 2026 : ఐపీఎల్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. మార్చి 28 నుంచి మైదానంలో పరుగుల వరద పారనుంది. ప్రతి ఏటా ఐపీఎల్‌లో ఏదో ఒక కొత్త నిబంధన వచ్చి ఆటతీరును మార్చేస్తుంటుంది. గతంలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లాగా ఈసారి భారీ మార్పులేవీ లేకపోయినా, బౌలర్లకు ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ వేసే టీమ్స్‌కు ఊరటనిచ్చేలా బీసీసీఐ (BCCI) ఒక సరికొత్త బాల్ రూల్‌ను తీసుకొచ్చింది. ఈ నిబంధన వల్ల మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026లో బంతి వినియోగానికి సంబంధించి అంపైర్లకు మరిన్ని అధికారాలు కల్పించారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు బంతి ఎక్కడైనా పోయినా లేదా దాని ఆకారం పూర్తిగా దెబ్బతిన్నా, అంపైర్లు వెంటనే దాన్ని మార్చేయవచ్చు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. పాత బంతికి బదులు కొత్త బంతిని ఇవ్వరు. ఆ బంతి ఎన్ని ఓవర్ల పాటు వాడబడిందో, దాదాపు అదే స్థితిలో ఉన్న మరో పాత బంతిని అంపైర్లు ఎంపిక చేస్తారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు బ్యాటర్లకు, ఫీల్డింగ్ కెప్టెన్‌కు అంపైర్లు సమాచారం అందిస్తారు.
రాత్రి పూట జరిగే మ్యాచ్‌లలో సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసే జట్లకు మంచు అనేది పెద్ద శాపంగా మారుతుంటుంది. బంతి తడిచిపోవడం వల్ల బౌలర్లకు గ్రిప్ దొరకదు, ఫలితంగా బ్యాటర్లు సులభంగా పరుగులు చేసేస్తారు. ఈ సమస్యను పరిష్కరించడానికి బీసీసీఐ ఒక వినూత్న నిబంధన తెచ్చింది. దీని ప్రకారం, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే జట్టు 10 ఓవర్లు ముగిసిన తర్వాత ఒక్కసారి బంతిని మార్చమని అంపైర్లను కోరవచ్చు. ఈ అవకాశం ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. దీనివల్ల బౌలర్లు మంచు ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
బంతి మార్చమని కోరడానికి ఫీల్డింగ్ జట్టు ఒక ముఖ్యమైన షరతును పాటించాల్సి ఉంటుంది. బంతిని కేవలం ఓవర్ పూర్తయిన తర్వాతే మార్చాలి. ఓవర్ మధ్యలో బంతిని మార్చడానికి అంపైర్లు అనుమతించరు. అంతేకాకుండా, బంతిని మార్చడానికి మంచు ఉండాలనే నిబంధన ఏమీ లేదు. కేవలం బంతి పట్టు దొరకడం లేదని లేదా పరిస్థితి బాగోలేదని భావిస్తే కెప్టెన్ ఈ అభ్యర్థన చేయవచ్చు. అయితే, ఈ సందర్భంలో కూడా అంపైర్లు పాత బంతికి దాదాపు దగ్గరగా ఉండే మరో బంతినే ఇస్తారు తప్ప సరికొత్త బంతిని ఇవ్వరు.
ఫీల్డింగ్ టీమ్ అడిగినప్పుడు కాకుండా, ఒకవేళ మ్యాచ్ మధ్యలో బంతి పరిస్థితి మరీ దారుణంగా తయారైందని అంపైర్లు భావిస్తే, వారు తమకు తోచినప్పుడు బంతిని మార్చే అధికారం కలిగి ఉంటారు. ఐపీఎల్ వంటి హై వోల్టేజ్ టోర్నమెంట్‌లో ప్రతి పరుగు, ప్రతి వికెట్ ముఖ్యం కాబట్టి, ఆటలో పారదర్శకత, సమానత్వం కోసం ఈ రూల్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ ఎంచుకునే జట్లకు ఉన్న అడ్వాంటేజ్‌ను ఈ రూల్ కొంతవరకు అడ్డుకునే అవకాశం ఉంది, దీనివల్ల పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
