AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరుగు పందెంలో విషాదం.. కుప్పకూలిన మహిళా రన్నర్‌!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ రన్నింగ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ యూ జీ-వోన్‌ (Yoo Ji-won) మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ఉత్సాహంగా హాఫ్‌ మారథాన్‌లో పాల్గొన్న ఆమె.. గమ్యస్థానానికి చేరుకోవడానికి కిలోమీటర్‌ కూడా లేని సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. సియోల్‌లో జరిగిన ఈ ఘటనతో తోటి రన్నర్లు, ఆమె అభిమానులు షాకయ్యారు.

పరుగు పందెంలో విషాదం.. కుప్పకూలిన మహిళా రన్నర్‌!
South Korean Influencer Collapses Just Before Finishing Line In Half Marathon
Sharada V
|

Updated on: Oct 17, 2026 | 8:25 PM

Share

దూరం పరుగెత్తడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. అయితే, అదే పరుగు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుందా? తీవ్రంగా పరుగెత్తుతున్న సమయంలో శరీరంపై పడే ఒత్తిడి, గుండెకు సంబంధించిన సమస్యలు, నీరు, లవణాల లోపం వంటి కారణాలు ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీస్తుంది. తాజాగా దక్షిణ కొరియాలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.

దక్షిణ కొరియాకు చెందిన 25 ఏళ్ల రన్నింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ యూ జీ-వోన్ (Yoo Ji-won) హాఫ్ మారథాన్‌లో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయింది. అక్టోబర్ 11, 2026న సియోల్‌లో జరిగిన మారథాన్‌లో ఆమె విషాదానికి గురైంది.  21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌లో పాల్గొన్న యూ జీ-వోన్.. దాదాపు 20.6 కిలోమీటర్లు పరుగెత్తింది. అంటే గమ్యస్థానానికి చేరుకోవడానికి కేవలం 500 మీటర్ల దూరం మాత్రమే ఉంది. ఇంతలోనే ఆమె ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయింది.

వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) కూడా చేశారు. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. ఈ విషయాన్ని రేసు నిర్వాహకులు అధికారికంగా ప్రకటిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తన రన్నింగ్ ప్రయాణం, సాధించిన విజయాలను పంచుకునే యూ జీ-వోన్ మృతి అభిమానులను విషాదంలో ముంచెత్తింది.

స్నేహితుడి భావోద్వేగ పోస్ట్‌..

యూ జీ-వోన్‌ మరణవార్త ను ఆమె స్నేహితులు నమ్మలేకపోతున్నారు. ఆమెతోపాటు రన్నింగ్‌ కంటెంట్‌ రూపొందించే బమ్మీ అనే మరో రన్నర్‌ తన బాధను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. తాను రేసు పూర్తి చేసుకుని ఫినిషింగ్‌ లైన్‌ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉండటం చూశాననీ, ఎవరికో గాయమై ఉంటుందని భావించాననీ చెప్పాడు. రేసు పూర్తి చేసిన తర్వాత అవార్డుల వేదిక వద్ద యూ జీ-వోన్‌ కోసం వెతికానని, కానీ ఆమెకు సంబంధించిన విషాదవార్త వినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరి క్షణాల్లో ఆమె పక్కన ఉండలేకపోయాననీ విచారించాడు. ఈ పోస్ట్‌ ఆమె అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.

ఎవరీ యూ జీ-వోన్‌?

యూ జీ-వోన్‌ దక్షిణ కొరియాలో వేగంగా ఎదుగుతున్న రన్నర్లలో ఒకరు. రన్నింగ్‌పై తనకున్న ఆసక్తిని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో 9,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. తన రన్నింగ్‌ శిక్షణ, సాధన, పోటీల్లో సాధించిన విజయాలు, అథ్లెటిక్‌ ప్రయాణానికి సంబంధించిన వివరాలను తరచూ పంచుకునేది. పరుగు ఆమెకు కేవలం వ్యాయామం మాత్రమే కాదు.. ఎంతో ఇష్టమైన అభిరుచి కూడా.

చదువులోనూ ప్రతిభ.. ఏఐ సెమీకండక్టర్లలో మాస్టర్స్‌ డిగ్రీ

యూ జీ-వోన్‌ కేవలం రన్నింగ్‌లోనే కాదు.. చదువులోనూ ప్రతిభ కనబరిచింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ బయో ప్రకారం, దక్షిణ కొరియాలోని ప్రతిష్ఠాత్మక కొరియా అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (KAIST)లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సెమీకండక్టర్ల విభాగంలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ పూర్తి చేసింది. రన్నింగ్‌పై ఆమెకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. చదువు, క్రీడలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యూ జీ-వోన్‌ ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం అభిమానులను విషాదంలో ముంచెత్తింది.

ఆమె మరణానికి కారణం ఏమిటి?

హాఫ్‌ మారథాన్‌లో పరుగెత్తుతూ యూ జీ-వోన్‌ స్పృహ కోల్పోయి మరణించినప్పటికీ, ఆమె మృతికి కచ్చితమైన కారణం ఏమిటో అధికారికంగా నిర్ధారణ కాలేదు. తీవ్రమైన శారీరక శ్రమ సమయంలో గుండె సంబంధిత సమస్యలు, శరీరంలో నీరు లేదా ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత, అధిక వేడి వంటి అంశాలు కొందరిలో అత్యవసర పరిస్థితులకు కారణం కావచ్చు. పరుగెత్తే సమయంలో ఛాతినొప్పి, అసాధారణ ఆయాసం, తల తిరగడం లేదా అకస్మాత్తుగా నీరసం రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us