KKR vs LSG : కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ కైఫ్ ఫైర్

KKR vs LSG : కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రిన్స్ యాదవ్ వేసిన ఓవర్లో నాలుగో బంతిని కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ గాల్లోకి లేపాడు. అది థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లగా, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న దిగ్వేష్ రాఠీ అద్భుతమైన డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకున్నాడు.

KKR vs LSG : కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ కైఫ్ ఫైర్
Kkr Vs Lsg

Updated on: Apr 09, 2026 | 8:57 PM

KKR vs LSG : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతున్న మ్యాచ్ వివాదానికి కేంద్రం అయింది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకోగా, కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే థర్డ్ అంపైర్ ఇచ్చిన ఒక నిర్ణయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అది క్యాచ్ కాదు సిక్స్ అంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు అంపైరింగ్ ప్రమాణాలను ఎండగడుతున్నారు.

కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రిన్స్ యాదవ్ వేసిన ఓవర్లో నాలుగో బంతిని కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ గాల్లోకి లేపాడు. అది థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లగా, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న దిగ్వేష్ రాఠీ అద్భుతమైన డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకున్నాడు. అయితే, క్యాచ్ పట్టే క్రమంలో అతని కాలు బౌండరీ కుషన్‌కు చాలా దగ్గరగా ఉంది. రీప్లేలో ఒక యాంగిల్ నుంచి చూస్తే దిగ్వేష్ కాలు బౌండరీ కుషన్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ థర్డ్ అంపైర్ దీనిని సరిగ్గా పరిశీలించకుండానే అవుట్ అని ప్రకటించడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది.

ఈ నిర్ణయంపై జియో హాట్‌స్టార్‌లో కామెంట్రీ చేస్తున్న టీమిండియా మాజీ ఆటగాడు మొహమ్మద్ కైఫ్ తీవ్రంగా స్పందించాడు. అది క్లియర్ గా సిక్స్ అని, అంపైర్లు నిర్ణయం తీసుకోవడంలో తొందరపడ్డారని విమర్శించాడు. “ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ అని చెప్పుకుంటున్నాం, ఇన్ని కెమెరాలు ఉన్నాయి.. కానీ థర్డ్ అంపైర్ కనీసం అన్ని యాంగిల్స్ చెక్ చేయకుండానే ఎలా అవుట్ ఇస్తారు?” అంటూ లైవ్‌లోనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్ల తప్పిదం వల్ల ఒక ప్రమాదకరమైన బ్యాటర్ వికెట్ కోల్పోవాల్సి వచ్చిందని కైఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఫిన్ అలెన్ 8 బంతుల్లో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతను క్రీజులో ఉంటే పవర్ ప్లేలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడని కేకేఆర్ అభిమానులకు తెలుసు. అందుకే సోషల్ మీడియాలో చీటింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బౌండరీ కుషన్ కదిలినట్లు కనిపిస్తున్నా అంపైర్ ఎందుకు అవుట్ ఇచ్చారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేకేఆర్ జట్టుకు అన్యాయం జరిగిందని, అంపైర్ల వల్ల మ్యాచ్ ఫలితం మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి సీజన్‌లోనూ ఐపీఎల్ అంపైరింగ్ వివాదాలు సర్వసాధారణం అయిపోయాయి. అయితే 2026 సీజన్‌లో టెక్నాలజీ ఇంతగా పెరిగిన తర్వాత కూడా ఇటువంటి బ్లైండ్ నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం ఒకే ఒక యాంగిల్ చూసి థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించడం వల్ల లక్నోకు అనవసర ప్రయోజనం చేకూరిందని, కేకేఆర్ ఒక కీలక వికెట్ నష్టపోయిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆటలో ఇటువంటి నిర్ణయాలు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us