IPL 2026 Auction : ఆ ముగ్గురికి నో ఎంట్రీ.. ఎంత పెద్ద స్టార్ ప్లేయర్ అయినా ఐపీఎల్ రూల్స్ పాటించాల్సిందే
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈ వేలంలో గరిష్టంగా 77 మంది ఆటగాళ్లపై మాత్రమే ఫ్రాంచైజీలు బిడ్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆక్షన్ కోసం ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి దిగ్గజ టీ20 స్పెషలిస్ట్‌లు అందుబాటులో ఉండనున్నారు.

IPL 2026 Auction : ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈ వేలంలో గరిష్టంగా 77 మంది ఆటగాళ్లపై మాత్రమే ఫ్రాంచైజీలు బిడ్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆక్షన్ కోసం ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి దిగ్గజ టీ20 స్పెషలిస్ట్‌లు అందుబాటులో ఉండనున్నారు. అయితే బీసీసీఐ గతంలో పెట్టిన కొన్ని కఠినమైన నిబంధనల కారణంగా ముగ్గురు కీలకమైన, ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఈసారి వేలంలో పాల్గొనలేకపోతున్నారు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ కూడా ఉండటం గమనార్హం.
ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కంటే ముందు బీసీసీఐ ఆక్షన్ ప్రక్రియకు సంబంధించి రెండు కీలకమైన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు ప్రధానంగా విదేశీ ఆటగాళ్లను ఉద్దేశించి పెట్టారు. ఏదైనా విదేశీ ఆటగాడు మెగా ఆక్షన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ తర్వాత సీజన్‌లో జరిగే మినీ ఆక్షన్లో అతను పాల్గొనడానికి అనర్హుడు అవుతాడు.
ఒక ఆటగాడిని ఆక్షన్ ద్వారా కొనుగోలు చేసిన తర్వాత టోర్నమెంట్ ప్రారంభానికి ముందే అతను వ్యక్తిగత కారణాలు లేదా ఇతర కారణాలు చెప్పి తన పేరును ఉపసంహరించుకుంటే, అతనికి ఆక్షన్ టోర్నమెంట్‌లో పాల్గొనకుండా 2 సంవత్సరాల పాటు నిషేధం విధించబడుతుంది.
ఆక్షన్ మిస్ చేసుకోబోతున్న ఆ 3 దిగ్గజాలు
బీసీసీఐ పెట్టిన ఈ కఠిన నిబంధనల కారణంగా, ముగ్గురు ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాళ్లు ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌లో పాల్గొనలేకపోతున్నారు.
1. బెన్ స్టోక్స్ : ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ గతేడాది జరిగిన మెగా ఆక్షన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి ఇంగ్లాండ్ తరఫున ఎక్కువ కాలం ఆడాలనే ఉద్దేశంతోనే రిజిస్ట్రేషన్ చేసుకోలేదని ఆయన అప్పట్లో ప్రకటించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని కారణంగా ఇప్పుడు రాబోయే మినీ ఆక్షన్లో ఆయన పాల్గొనడానికి వీలు లేకుండా పోయింది.
2. హ్యారీ బ్రూక్ : ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్ అయిన హ్యారీ బ్రూక్ విషయంలో పేరు విత్ డ్రా నిబంధన వర్తిస్తుంది. 2024లో ఆయన తన బామ్మ మరణం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 2025 మెగా ఆక్షన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఇంగ్లాండ్ కెరీర్‌పై దృష్టి పెట్టాలనే కారణం చెప్పి, బ్రూక్ మళ్లీ టోర్నమెంట్ నుంచి పేరు ఉపసంహరించుకున్నాడు. దీని కారణంగా ఆయనపై రెండేళ్ల నిషేధం విధించబడి ఈ ఏడాది ఆక్షన్‌లో పాల్గొనలేకపోతున్నాడు.
3. జేసన్ రాయ్ : ఇంగ్లాండ్ విధ్వంసక ఓపెనర్ అయిన జేసన్ రాయ్ కూడా ఇదే జాబితాలో ఉన్నాడు. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నారు. అలాగే 2025 మెగా ఆక్షన్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకోని కారణంగా, జేసన్ రాయ్ కూడా ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో పాల్గొనడానికి వీలు లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




