MI vs PBKS: అంతా అయ్యర్‌నే మెచ్చుకుంటున్నారు కానీ.. అసలైన హీరో ఒకడున్నాడు! ముంబై బలాన్ని దెబ్బతీశాడు..
ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌పై గెలిచి ఫైనల్‌కు చేరింది. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన 87 పరుగుల ఇన్నింగ్స్‌తో ముంబై బౌలింగ్‌ను ధ్వంసం చేశాడు. జోస్ ఇంగ్లిష్ జస్ప్రీత్ బుమ్రాను ధైర్యంగా ఎదుర్కొని పంజాబ్ బ్యాటింగ్ లైన్‌అప్‌కు ఆత్మవిశ్వాసం నింపాడు.

ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి క్వాలిఫైయర్ 2కు అర్హత సాధించిన ముంబై ఇండియన్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. పంజాబ్ కింగ్స్‌ను ఆపలేకపోయింది. క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్ ఈ నెల 3న (మంగళవారం) ఫైనల్ మ్యాచ్‌కు రెడీ అయింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎవరు గెలిచినా.. ఒక కొత్త ఛాంపియన్‌ను అయితే చూడబోతున్నాం. ఫైనల్ విషయం పక్కనపెడితే.. ముంబైపై శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం కెప్టెన్‌గా అయ్యర్ తీసుకున్న మంచి నిర్ణయం.
ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఒక కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా.. చివరి వరకు క్రీజ్‌లో నిలబడి విన్నింగ్ షాట్‌తో తన టీమ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. 41 బాల్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో.. అయ్యర్ బ్యాటింగ్‌పై, అతని కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎస్.. అతని ఆటకి, కెప్టెన్సీ వ్యూహాలకు ఆ మాత్రం క్రెడిట్ దక్కాల్సిందే. అయితే.. పంజాబ్ కింగ్స్ టీమ్‌లో మరో హీరో ఉన్నాడు. నిజం చెప్పాలంటే.. ముంబై అంటే అందరికీ ఉండే భయాన్ని అతనే పోగొట్టాడు. ఇంతకీ ఎవరతను? అతను పోగొట్టిన భయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ క్వాలిఫైయర్ 2 కంటే ముందు ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 200 రన్స్ చేసిన తర్వాత ఎప్పుడూ ఓడిపోలేదు. 18 సార్లు 200 అంత కంటే ఎక్కువ రన్స్ చేసి 18 సార్లు ఆ స్కోర్‌ను డిఫెండ్ చేసుకుంది. అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. జస్ప్రీత్ బుమ్రా అని ఎవరైనా చెప్తారు. 20 ఓవర్లలో బుమ్రా వేసే 4 ఓవర్లు మ్యాచ్‌ను శాసించేవి. అలాంటి బుమ్రా నిన్నటి మ్యాచ్‌లోనూ ఉన్నాడు. అతని బౌలింగ్‌లో ఎలా ఆడతారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. 204 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 4 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. అది అంత మంచి స్టార్ట్ ఏం కాదు. అదే టైమ్‌లో బుమ్రా బాల్ అందుకున్నాడు.
అమ్మో.. పంజాబ్‌కు ఇగ ముడినట్టే అని అంతా అనుకున్నారు.. కానీ ఫస్ట్ బాల్‌కే పంజాబ్ బ్యాటర్ జోస్ ఇంగ్లిష్ ఫోర్ కొట్టాడు. అనవసరంగా బుమ్రాను రెచ్చగొడుతున్నాడని పంజాబ్ ఫ్యాన్స్ కూడా భయపడ్డారు. ఇంగ్లీషు.. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావ్ అంటూ తిట్టుకున్నారు. రెండో బాల్ డాట్.. మూడో బాల్ భారీ సిక్స్. అంతే స్టేడియం అంతా షాక్. అదే ఊపులో ఐదో బాల్‌కు ఫోర్, లాస్ట్ బాల్‌కు మరో సిక్స్.. మొత్తంగా బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సులతో ఇంగ్లిష్ ఏకంగా 20 రన్స్ రాబట్టాడు. ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఏ బౌలర్‌ను చూసి మిగతా టీమ్స్ భయపడతాయో.. 200 టార్గెట్ ఛేజ్ చేయాలంటే.. బుమ్రా బౌలింగ్‌లో వికెట్లు ఇవ్వకుంటే చాలు అని అనుకుంటారో.. అలాంటి బుమ్రాను ఇంగ్లిష్ చితక్కొట్టాడు. అంతే.. పంజాబ్ బ్యాటర్లలో భయం పూర్తిగా పోయింది.
200 టార్గెట్ ఊదిపారేస్తామనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీక తెలుసు. జోస్ ఇంగ్లిష్ చేసింది 38 పరుగులే అయినా.. అతను బుమ్రాను ఎదుర్కొన్న తీరు చాలా ఇంప్యాక్ట్ చూపించింది. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను బుమ్రా ఎలా కట్టడి చేశాడో చూశాం. అలాంటి బౌలర్‌ను ఏ మాత్రం భయం లేకుండా ఆడాడు. అది పంజాబ్ బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం పెంచడమే కాకుండా.. ముంబైలోని ఇతర బౌలర్ల కాన్ఫిడెన్స్‌ను కాస్త దెబ్బతీసింది. బుమ్రానే ఈ రేంజ్‌లో కొడుతున్నారంటే.. మన పరిస్థితి ఏంటో అనే ఒక చిన్న ఆలోచన అయితే ముంబై బౌలర్లకు వచ్చి ఉంటుంది. అందుకే క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్ గెలిచిందంటే.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరాతో పాటు జోస్ ఇంగ్లిష్‌కు కూడా క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




