IPL 2023: పొగపెట్టి పంపేశారు.. కట్ చేస్తే.. వేలంలో ఆ ఆటగాడే చెన్నై ప్రధాన టార్గెట్.. ఎవరో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2022లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో..

IPL 2023: పొగపెట్టి పంపేశారు.. కట్ చేస్తే.. వేలంలో ఆ ఆటగాడే చెన్నై ప్రధాన టార్గెట్.. ఎవరో తెలుసా?
Chennai Super Kings

Updated on: Dec 21, 2022 | 1:47 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2022లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో సరిపెట్టుకుంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ సీజన్‌పై కన్నేసిన చెన్నై జట్టు.. అందులో భాగంగానే మినీ వేలానికి ముందు పలువురి ప్లేయర్స్‌ను వదులుకుంది. అలాగే ఆక్షన్‌లో మంచి ఫామ్ ఉన్న ఆటగాళ్ళను దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. మరో రెండు రోజులు అంటే డిసెంబర్ 23న కొచ్చి వేదికగా ఐపీఎల్ 2023 మినీ వేలం జరగనుంది. ఇందులో ముఖ్యంగా ఐదుగురు ప్లేయర్స్‌పై చెన్నై ఫ్రాంచైజీ గురి పెట్టింది. అందులో ఒకరు మాజీ సీఎస్‌కే ఆటగాడు ఉండటం గమనార్హం.

నారాయణ్ జగదీషన్:

ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరపున ఆడిన నారాయణ్ జగదీషన్ అద్భుత ప్రతిభను కనబరిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ టోర్నమెంట్‌లోని ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలతో 830 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఈ ప్రదర్శనలతో అతడు మినీ వేలంలో భారీ ధర పలికే ఛాన్స్ కచ్చితంగా ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నైకు ప్రాతినిధ్యం వహించిన జగదీషన్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రం ఆడి 108.11 స్ట్రైక్ రేట్‌తో 40 పరుగులు చేశాడు. ఈ ఫామ్‌తో జగదీషన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ మినీ వేలానికి ముందు వదులుకున్నప్పటికీ.. విజయ్ హజారే ట్రోఫీలో అతడి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని మరోసారి వేలంలో సీఎస్‌కే టీం తీసుకునే అవకాశం లేకపోలేదు.

హ్యారీ బ్రూక్:

హ్యారీ బ్రూక్ ఈ సంవత్సరం విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడు. టీ20 వరల్డ్‌కప్‌లో చక్కటి ప్రదర్శన కనబరచని ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్.. పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మాత్రం సత్తా చాటాడు. టీ20 ఫార్మాట్ మాదిరిగా దంచికొట్టాడు. మూడు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో 468 పరుగులు చేశాడు. ఈ ఫామ్ బట్టి హ్యారీ బ్రూక్ మినీ వేలంలో భారీ డిమాండ్ పలికే అవకాశం ఉంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్‌లో ఉతప్ప స్థానంలో ఈ ఇంగ్లీష్ బ్యాటర్‌పై ఆసక్తి చూపించవచ్చు.

జాసన్ హోల్డర్:

చెన్నై సూపర్ కింగ్స్‌కు డ్వేన్ బ్రేవో గుడ్‌బై చెప్పాడు. ఇప్పటిదాకా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అతడు.. రిటైర్మెంట్ ప్రకటించడంతో మినీ వేలంలో ఆల్‌రౌండర్లపై కన్నేసింది చెన్నై. ఇందులో భాగంగా వెస్టిండిస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ గణాంకాలు ఫ్రాంచైజీని ఆకర్షిస్తున్నాయి. మునుపటి ఎడిషన్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG)కి ప్రాతినిధ్యం వహించిన హోల్డర్ 12 మ్యాచ్‌ల్లో 58 పరుగులు, 14 వికెట్లు సాధించాడు. అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో.. ఆ జట్టు అతడ్ని జట్టు నుంచి తప్పించింది.

ఈ మినీ వేలంలో అతడి బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు కాగా.. జాసన్ హోల్డర్ గత అనుభవం, అద్భుతమైన నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని చెన్నై సూపర్ కింగ్స్ ఎంపిక చేసుకునే అవకాశం లేకపోలేదు. కాగా, 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు ప్రాతినిధ్యం వహించిన హోల్డర్.. 7.75 ఎకానమీతో కేవలం ఎనిమిది మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టిన విషయం విదితమే.

సామ్ కర్రన్:

ఇంగ్లాండ్‌కు టీ20 ప్రపంచకప్ అందించడంలో సామ్ కర్రన్ కీలక పాత్ర పోషించాడు. 6.52 ఎకానమీతో 6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఇక అతడు మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకోవడంతో ఈ వరల్డ్ కప్ హీరోను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయి. గతంలో రెండు సీజన్లలోనూ CSKకు ప్రాతినిధ్యం వహించిన కర్రన్ తన అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. రాబోయే వేలంలో, అతడి బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు ధర కాగా.. ఇటీవలి అతడి ట్రాక్ రికార్డ్‌తో, మాజీ ఫ్రాంచైజీ చెన్నై మరోసారి కర్రన్‌ను వేలంలో దక్కించుకునే అవకాశం ఉంది.