Watch Video: ఐపీఎల్‌లో తొలిసారి అద్భుతం చేసిన రాజస్థాన్ టీం.. ఆ స్పెషల్ రికార్డులో చేరిన బ్యాటర్స్ ఎవరంటే?

|

Apr 19, 2022 | 2:50 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సోమవారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాట్స్‌మెన్స్ రన్నింగ్‌తో నాలుగు పరుగులు పూర్తి చేశారు.

Watch Video: ఐపీఎల్‌లో తొలిసారి అద్భుతం చేసిన రాజస్థాన్ టీం..  ఆ స్పెషల్ రికార్డులో చేరిన బ్యాటర్స్ ఎవరంటే?
Ipl 2022 Jos Buttler And Devdutt Padikkal
Follow us on

టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ నాలుగు పరుగులను కేవలం రన్స్ ద్వారా చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో సోమవారం జరిగిన రాజస్థాన్(Rajasthan Royals), కోల్‌కతా(Kolkata Knight Riders) మ్యాచ్‌లోనూ అలాంటిదే కనిపించింది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్లు జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్ నాలుగు పరుగులు చేశారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్‌లో ఉమేష్ యాదవ్ వేసిన చివరి బంతిని బట్లర్ పాయింట్ దిశగా ఆడాడు. ఆ ప్రాంతంలో ఉన్న వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా ఫీల్డింగ్ చేసి డైవింగ్ చేస్తూ బంతిని బౌండరీ లైన్ వెలుపలకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. అయితే, స్ట్రైకర్ ముగింపునకు చేరుకునేలోపు జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్ నాలుగు పరుగులు చేయడంతో వెంకటేష్ అయ్యర్ ప్రయత్నం ఫలించలేదు. ఐపీఎల్ చరిత్రలో ఓవర్‌త్రో లేకుండా బ్యాట్స్‌మెన్ నాలుగు పరుగులు చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు 2017లో, గ్లెన్ మాక్స్‌వెల్ నాలుగు పరుగులు చేశాడు. అయితే ఈ సమయంలో అతను ఓవర్ త్రోలో రెండు పరుగులు చేశాడు.

పోరాడి ఓడిన కేకేఆర్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఐదు వికెట్లకు 217 పరుగులు చేసింది. బట్లర్ 61 బంతుల్లో 103 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. KKR బౌలర్లను భీకరంగా దెబ్బతీశాడు. బట్లర్ తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. బట్లర్‌తో పాటు సంజూ శాంసన్ 38, షిమ్రాన్ హెట్మెయర్ 26 నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి అత్యధికంగా ఇద్దరు ఆటగాళ్లను సునీల్ నరైన్ అవుట్ చేశాడు. ఇది కాకుండా ఆండ్రీ రస్సెల్, శివమ్ మావి, పాట్ కమిన్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా మొదటి బంతికే వికెట్‌ కోల్పోయింది. సమన్వయ లోపంతో సునీల్‌ నరైన్‌ మొదటి బంతికే రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఓపెనర్ ఆరోన్ ఫించ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ధాటిగా ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే వీరు తప్ప మరే బ్యాటర్‌ క్రీజులో నిలవలేదు. నితీశ్‌ రాణా (18), ఆండ్రీ రస్సెల్‌ (0), షెల్డన్‌ జాక్సన్‌ (8) పూర్తిగా నిరాశపరిచారు. ఇక చివర్లో ఉమేష్ యాదవ్ ( 9 బంతుల్లో 21) ధాటిగా ఆడి జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. అయితే చాహల్‌ వరుసగా వికెట్లు తీయడంతో ఓటమి తప్పించుకోలేకపోయింది.

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (85), ఓపెనర్‌ ఫించ్‌ (58) రాణించడంతో ఛేదనలో చివరి వరకు పోరాడింది కోల్‌కతా. అయితే చాహల్‌ స్పిన్‌ మ్యాజిక్‌కు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో 19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటై 7 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. హ్యాట్రిక్‌ తో పాటు ఐదు వికెట్లతో రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన యూజీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. కాగా ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి 7 మ్యాచ్‌లో ఇది నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆజట్టు ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

Also Read: KTR: సన్‌రైజర్స్‌ బౌలర్‌ స్పీడ్‌కు కేటీఆర్‌ ఫిదా.. ఐపీఎల్‌లో చరిత్రలోనే అత్యుత్తమ ఓవర్‌ అంటూ..

IPL 2022: నీ దూకుడూ.. సాటెవ్వడు.. ఆకాశమే హద్దుగా చెలరేగుతోన్న RR ప్లేయర్.. కోహ్లీ రికార్డుకు ఎసరు?