IPL 2021: ఐపీఎల్‌కు మూడు ఆప్షన్లు.. అడుగులు ఎటువైపు ప‌డేను.. ముంబాయి నగరంలో మిగిలిన సీజన్‌..!

| Edited By: Phani CH

May 05, 2021 | 4:56 PM

మెగా టోర్నమెంట్‌ ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడటంతో బీసీసీఐకి భారీగా నష్టం వాటిల్లబోతున్నదని అంచనా వేస్తున్నారు. మరి ఆటగాళ్ల ప్రాణాల సంగతేమిటన్నది ఎవరూ ఆలోచించడం లేదు.

IPL 2021: ఐపీఎల్‌కు మూడు ఆప్షన్లు.. అడుగులు ఎటువైపు ప‌డేను.. ముంబాయి నగరంలో మిగిలిన సీజన్‌..!
Ipl 2021
Follow us on

మెగా టోర్నమెంట్‌ ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడటంతో బీసీసీఐకి భారీగా నష్టం వాటిల్లబోతున్నదని అంచనా వేస్తున్నారు. మరి ఆటగాళ్ల ప్రాణాల సంగతేమిటన్నది ఎవరూ ఆలోచించడం లేదు. నిజానికి దేశంలో కరోనా భయంకరంగా విరుచుకుపడుతున్న సమయంలో ఐపీఎల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించడం అవసరమా అన్న చర్చ కూడా నడిచింది. చాలా మంది ఇంత భయానక పరిస్థితుల మధ్య ఐపీఎల్‌ను కండక్ట్ చేయడం మంచిది కాదని హితవు చెప్పారు. అయినా బీసీసీఐ పట్టించుకోలేదు. ఐపీఎల్‌-14 సీజన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ జరిపితీరుతామని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు చెప్పుకుంటూ వచ్చింది. కోట్లాది రూపాయలతో ముడిపడిన విషయం కాబట్టి బీసీసీఐకి టోర్నీని రద్దు చేయాలన్న ఆలోచన కానీ, వాయిదా వేయాలన్న తలంపు కానీ కలగలేదు. అయితే ఐపీఎల్‌లో పార్టిసిపేట్‌ చేస్తున్న ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఇక గత్యంతరం లేక భారమైన మనసుతో టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. మళ్లీ ఎప్పుడు జరుపుతామన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు కానీ వీలైనంత తొందరలో టోర్నీని తిరిగి జరపాలన్న పట్టుదలతో ఉన్నట్టు అర్థమవుతోంది. కోట్లాది రూపాయలను కోల్పోవడం బీసీసీఐకు ఇష్టం లేదు. పది రోజుల వ్యవధిలో ఐపీఎల్‌ను జరపాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందన్నది ఇన్‌సైడ్‌ టాక్‌. లెక్కలు బాగా వేసుకునే బీసీసీఐ కరోనా బారిన పడ్డ క్రికెటర్లకు ఫ్రాంచైజీలకు అప్పటితో క్వారంటైన్‌ పూర్తి అవుతుందన్న లెక్కలు కూడా వేసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌పై ముందుకెళ్లాలని బీసీసీఐ చూస్తోంది. ఇందుకోసం రెండు మూడు ఆప్షన్లను పెట్టుకుంది. అందులో మొదటిదేమిటంటే ముంబాయి వేదికగా మొత్తం మిగిలిన సీజన్‌ను జరపడం. అందుకు కారణం ముంబాయిలో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలు ఉండటం. ముంబాయి నగరంలో వాంఖడే స్టేడియంతో పాటు బ్రాబౌర్న్‌ స్టేడియం, ముంబాయి జింఖానాలు ఉన్నాయి. బ్రాబౌర్న్‌లో అయితే ఒకప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా జరిగాయి.

అందుకే ముంబాయి నగరంలో మిగిలిన సీజన్‌ను జరపాలని అనుకుంటోంది. ఇది ఓ రకంగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్టే. పైగా ఆటగాళ్లకు ప్రయాణపు భారం తగ్గుతుంది. కరోనా కాలంలో అటు ఇటు తిరగకుండా ఒక్కచోటే ఉండటం మంచిది. దీంతో పాటు ఒకే వేదికలో మ్యాచ్‌లను నిర్వహిస్తే ఎలా ఉంటుందన్నది కూడా ఆలోచిస్తోంది.. ఇప్పటికే ముంబాయి నగరంలోని స్టేడియంలకు దగ్గరలో ఉన్న హోటళ్లతో సంప‍్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ అహ్మదాబాద్‌-ఢిల్లీ- ముంబై, చెన్నైల్లో తొలి అంచె మ్యాచ్‌లను నిర్వహించారు, రెండో దశలో బెంగళూరు, కోల్‌కతా నగరాలలో నిర్వహించాలనుకున్నారు. ఇన్ని స్టేడియంలలో బయోబబుల్‌లో మ్యాచ్‌లు నిర్వహించే కంటే ముంబాయిలో ఉన్న మూడు క్రికెట్‌ స్టేడియంలలో మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించడంపై దృష్టి పెట్టింది బీసీసీఐ. ఇక్కడ పూర్తిస్థాయి బయోబబుల్‌లో ఉంచి టోర్నమెంట్‌ను నిర్వహించడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నదట! ఇది జరగకపోతే రెండో ఆప్షన్‌గా జూన్‌లో నిర్వహించాలని అనుకుంటోంది. జూన్‌ మాసం వరకు కరోనా తీవ్రత తగ్గుతుందన్న ఆశాభావంతో బీసీసీఐ ఉంది. అయితే జూన్‌లో ఐపీఎల్‌ను నిర్వహించడం వల్ల ఓ సమస్య ఉంది. అదే సమయంలో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య సౌతాంప్టన్లో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉంది. ఐపీఎల్‌ కండక్ట్‌ చేస్తే టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వాయిదా వేయాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌ జూన్‌ 18న మొదలు కానుంది. ఐసీసీని బతిమాలో బామాలో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను జులై నెలకు వాయిదా వేయించాలని బీసీసీఐ అనుకుంటోంది. ఇక ఈ రెండు కుదరకపోతే అక్టోబర్‌-నవంబర్‌ నెలలలో అంటే టీ-20 వరల్డ్‌ కప్‌కు ముందే ఐపీఎల్‌ మిగతా సీజన్‌ను కంప్లీట్‌ చేయాలనే ఆలోచన కూడా చేస్తోంది. నిజానికి టీ-20 వరల్డ్‌ కప్‌కు ఇండియానే ఆతిథ్యమిస్తోంది. అప్పటికీ కరోనా విజృంభణ తగ్గకపోతే మాత్రం వరల్డ్‌కప్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు షిఫ్ట్‌ చేయక తప్పదు. అదే జరిగితే పనిలో పనిగా అక్కడే ఐపీఎల్‌ను కూడా కండక్ట్‌ చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

Also Read: ఐపీఎల్ మ్యాచ్‌ల వాయిదాతో తీరని నష్టం.. బీసీసీఐకి లాస్ ఎంతంటే?

 ‘ఈ సాలా కప్ నమదే’ నిజం చేస్తారనుకుంటే.. ఇలా అయిందేనట్రా.! నెట్టింట్లో పేలుతున్న జోకులు..