IPL 2023: తాత పెన్షన్‌తో కోచింగ్‌ తీసుకున్నాడు.. టీమిండియాకు వరల్డ్‌ కప్‌ అందించాడు.. ఇప్పుడు ఐపీఎల్‌ అరంగేట్రం

|

Apr 12, 2023 | 8:53 AM

ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌ టోర్నీలో అరంగేట్రం చేశాడు యశ్‌ ధుల్‌. అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టిన ఈ 20 ఏళ్ల కుర్రాడికి పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఢిల్లీ క్యాప్‌ ఇచ్చి సాదరంగా జట్టులోకి ఆహ్వానించాడు. అయితే ధనాధన్ లీగ్ లో మొదటి మ్యాచ్‌ ఆడుతున్న ధూల్‌ కేవలం 2 పరుగులకే వెనుదిరిగాడు.

IPL 2023: తాత పెన్షన్‌తో కోచింగ్‌ తీసుకున్నాడు.. టీమిండియాకు వరల్డ్‌ కప్‌ అందించాడు.. ఇప్పుడు ఐపీఎల్‌ అరంగేట్రం
Yash Dhull
Follow us on

IPL 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు అన్నింటిలోనూ ఓటములు ఎదుర్కొంది. గెలుపుకోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూస్తోంది వార్నర్‌ సేన. కాగా మంగళవారం ముంబై ఇండియన్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో వార్నర్ సేనకు త్రుటిలో గెలుపు దూరమైంది. కాగా ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌ టోర్నీలో అరంగేట్రం చేశాడు యశ్‌ ధుల్‌. అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టిన ఈ 20 ఏళ్ల కుర్రాడికి పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఢిల్లీ క్యాప్‌ ఇచ్చి సాదరంగా జట్టులోకి ఆహ్వానించాడు. అయితే మొదటి మ్యాచ్‌ ఆడుతున్న ధూల్‌ కేవలం 2 పరుగులకే వెనుదిరిగాడు. అయితే చాలామంది లాగే యశ్‌ కూడా ఎన్నో కష్టాలను దాటి ఈ స్థాయికి వచ్చాడు. ఈ సందర్భంగా అతని స్ట్రగులింగ్‌ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి.

కుమారుడి కోసం ఉద్యోగం త్యాగం..

యష్ ధుల్ ఢిల్లీ నివాసి. అతని తండ్రి పేరు విజయ్ ధుల్. తన కుమారుడిని క్రికెటర్‌గా చూడాలన్న కోరికతో తన ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు విజయ్‌. తన కుమారుడికి మంచి క్రికెట్ బ్యాట్‌ కొనివ్వడానికి తన ఇంటి ఖర్చులను తగ్గించుకున్నాడు. ఇక ధుల్‌ కుటుంబం మొత్తం తన తాతకు వచ్చే పెన్షన్‌ డబ్బులతోనే నడిచేదంటే వారి ఆర్థిక పరిస్థితి ఎంత దీనంగా ఉండేదో ఇట్టే అర్థంచేసుకోవచ్చు. అయితే తన కోసం తండ్రి, తాతలు పడిన శ్రమను వృథాగా పోనియలేదు ధుల్‌. గతేడాది వెస్టిండీస్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో యష్ ధుల్ టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించి ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ టోర్నీలో యష్ ధుల్ 4 మ్యాచ్‌ల్లో 76.33 సగటుతో 229 పరుగులు చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో, ధూల్ తన బ్యాట్ పదును మరోసారి రుచి చూపించాడు. మొదటి మ్యాచ్‌లోనే తుఫాను సెంచరీని కొట్టాడు.

ఇవి కూడా చదవండి

మూడు ఫార్మాట్లలోనూ మెరుపులు..

కాగా టీ20 ఫార్మాట్‌లో యష్ ధుల్ పేరిట అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు 8 టీ20 మ్యాచ్‌లు ఆడిన యశ్‌ 72 కంటే ఎక్కువ సగటుతో 363 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 130 కంటే ఎక్కువగానే ఉంది. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో, ధూల్ దాదాపు 50 సగటుతో పరుగులు చేశాడు. లిస్ట్ Aలో ధుల్ సగటు కూడా 40కి చేరువలో ఉంది. ఇలా మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు యశ్‌. ఇదే జోరుతో ఇప్పుడు ఐపీఎల్‌ అరంగేట్రం ఇచ్చాడు. ఇక్కడ సత్తాచాటితే టీమిండియాలో చోటు దక్కించుకోవడం యశ్‌కు పెద్ద కష్టమేమీ కాదని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..