Team India: 20 ఓవర్ల మ్యాచ్.. 26 బంతుల్లోనే మ్యాచ్ ముగించిన భారత్..

U19 T20 World Cup 2025: భారత U-19 మహిళల క్రికెట్ జట్టు జనవరి 18న తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44 పరుగులు మాత్రమే చేయగా, లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 26 బంతుల్లోనే విజయం సాధించింది. జోషితకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Team India: 20 ఓవర్ల మ్యాచ్.. 26 బంతుల్లోనే మ్యాచ్ ముగించిన భారత్..
U19 Team India

Updated on: Jan 19, 2025 | 6:06 PM

U19 T20 World Cup 2025: జనవరి 18న ప్రారంభమైన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజయభేరీ మోగించింది. నేడు అరంగేట్ర మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడిన టీమిండియా 20 ఓవర్ల లక్ష్యాన్ని కేవలం 26 బంతుల్లోనే ఛేదించింది. దీంతో వెస్టిండీస్ జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 13.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 44 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టు 4.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. వెస్టిండీస్‌ను ఏకపక్షంగా ఓడించడం ద్వారా టీమిండియా తమ ఇతర ప్రత్యర్థులకు స్పష్టమైన సందేశాన్ని పంపింది.

సులభంగా లక్ష్యాన్ని ఛేదించిన భారత్..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి పూర్తి 20 ఓవర్లు ఆడలేకపోయింది. దీంతో జట్టు మొత్తం 13.2 ఓవర్లలో 44 పరుగులకు ఆలౌటైంది. దీంతో టోర్నీ చరిత్రలోనే అతి తక్కువ స్కోరుకే వెస్టిండీస్ జట్టు అవాంఛనీయ రికార్డును లిఖించింది. 45 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి విజయం సాధించింది.

9 వికెట్ల తేడాతో విజయం..

45 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 4 పరుగులకే ఏకైక వికెట్ కోల్పోయింది. కానీ, ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ వెస్టిండీస్‌కు రెండో వికెట్ దక్కే అవకాశం ఇవ్వలేదు. కమలిని, చాల్కే మధ్య రెండో వికెట్‌కు 43 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొంది. దీంతో వెస్టిండీస్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

26 బంతుల్లోనే విజయం..

కౌలాలంపూర్‌లో వర్షం కురుస్తున్నందున ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో 45 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఆరంభం నుంచే చెలరేగింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన జట్టు కెప్టెన్ నిక్కీ ప్రసాద్.. మ్యాచ్‌ను వీలైనంత త్వరగా ముగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. కాబట్టి మేం సూచనల ప్రకారం బ్యాటింగ్ చేశాం. ఆశ్చర్యకరంగా భారత్ మ్యాచ్ గెలిచిన వెంటనే మైదానంలో వర్షం కురిసింది.

జోషితాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్..

ఈ మ్యాచ్‌లో భారత్‌ తరపున బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన జోషితాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. జోషిత తన 2 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..