
India’s U19 Team Smashes 442 Runs In 50 Overs In England: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. లౌబరో వేదికగా ఇంగ్లండ్ యంగ్ లయన్స్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత యువకులు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఏకంగా 442 పరుగుల భారీ స్కోరును నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఐపీఎల్ స్టార్లు కాదు. ఓ ట్రక్ డ్రైవర్ కొడుకు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోరు అందించడమే కాకుండా, క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.
ట్రక్ డ్రైవర్ తనయుడి శతక గర్జన..
ఈ మ్యాచ్‌లో అసలు హీరో హర్వాన్ష్ పంగాలియా. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన ఈ యువ వికెట్ కీపర్-బ్యాటర్ కేవలం 52 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 103 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అతని తండ్రి కెనడాలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, హర్వాన్ష్ మాత్రం తన క్రికెట్ కలను సాకారం చేసుకునేందుకు భారతదేశంలోనే ఉండిపోయాడు. అతని ఈ నిర్ణయం ఎంత సరైనదో ఈ ఇన్నింగ్స్‌తో ప్రపంచానికి చాటి చెప్పాడు. ముఖ్యంగా, జట్టు 91 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన హర్వాన్ష్, మరో ఎండ్‌లో రాహుల్ కుమార్ (73), కనిష్క్ చౌహాన్ (79), ఆర్.ఎస్. అంబ్రిష్ (72)లతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు స్కోరును 400 దాటించాడు.
తేలిపోయిన ఐపీఎల్ స్టార్లు..
ఈ మ్యాచ్‌లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ 2025 సీజన్‌లో మెరిసిన యువ సంచలనాలు ఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయుష్ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరగా, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన 14 ఏళ్ల వైభవ్ 17 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఎంతో పేరు ప్రఖ్యాతులు, ఐపీఎల్ అనుభవం ఉన్న ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు విఫలమైన చోట, ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హర్వాన్ష్ అద్భుత శతకంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.
భారీ తేడాతో ఘనవిజయం..
భారత జట్టు నిర్దేశించిన 443 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ యంగ్ లయన్స్ జట్టు 41.1 ఓవర్లలో 211 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ కెప్టెన్ విల్ బెనిసన్ (103) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 3 వికెట్లతో రాణించగా, నమన్ పుష్పక్, విహాన్ మల్హోత్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో భారత యువ జట్టు 231 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, తమ పర్యటనను ఘనంగా ప్రారంభించింది.
ఈ విజయం భారత యువ క్రికెటర్లలో ఉన్న ప్రతిభకు, వారి పోరాట పటిమకు నిదర్శనం. ముఖ్యంగా, హర్వాన్ష్ పంగాలియా వంటి మట్టిలో మాణిక్యాల కథలు ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయనడంలో సందేహం లేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..