IND vs PAK: 125 పరుగులకే ఆలౌట్.. కట్ చేస్తే.. దాయాదికి షాకిచ్చిన టీమిండియా.. దుబాయిలో అసలేం జరిగిందో తెలుసా?

1985లో షార్జాలో జరిగిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా నిలిచింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ బౌలర్లు భారత్‌ను 125 పరుగులకే ఆలౌట్ చేయగా, మ్యాచ్ వారిదేనని అనుకున్నారు. కానీ భారత బౌలర్లు కపిల్ దేవ్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, రవి శాస్త్రి అద్భుత ప్రదర్శన చేసి పాకిస్థాన్‌ను 87 పరుగులకే కుప్పకూల్చి 35 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్ తక్కువ స్కోర్ ఉన్నప్పటికీ, బౌలింగ్ శక్తితో గెలవొచ్చని భారత జట్టు నిరూపించింది.

IND vs PAK: 125 పరుగులకే ఆలౌట్.. కట్ చేస్తే.. దాయాదికి షాకిచ్చిన టీమిండియా.. దుబాయిలో అసలేం జరిగిందో తెలుసా?
India Vs Pakistan

Updated on: Feb 21, 2025 | 7:58 PM

భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ దాయాదుల సమరం కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటోంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా ఇరు దేశాల అభిమానుల మధ్య భావోద్వేగాలు తారస్థాయిలో ఉంటాయి. దాయాదుల పోరు క్రికెట్ మైదానంలో ఓ యుద్ధాన్ని తలపిస్తుంది. అలాంటి సమరానికే రంగం సిద్దమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉన్నా అప్పుడే భారత్-పాక్ ఫీవర్ మొదలైంది. ఇరు దేశాల మాజీ క్రికెటర్లు తమ అంచనాలతో ఆసక్తిని రేకిత్తిస్తుంటే అభిమానులు గత రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు. అయితే 40 ఏళ్ల క్రితం షార్జా వేదికగా భారత్-పాక్ మధ్య జరిగిన ఓ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగులే చేసి 35 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.

భారత్ 125 పరుగులకే ఆలౌట్

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య 1985‌లో రోత్స్‌మన్ 4 నేషన్స్ కప్‌ నిర్వహించారు. ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 125 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ దిగ్గజ పేసర్ ఇమ్రాన్ ఖాన్(6/14) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. టవ్‌సీఫ్ అహ్మద్(2/27) రెండు వికెట్లు తీయగా.. నజర్, వసీమ్ అక్రమ్ తలో వికెట్ తీసారు.

భారత బ్యాటింగ్‌లో మహమ్మద్ అజారుద్దీన్(93 బంతుల్లో 3 ఫోర్లతో 47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కపిల్ దేవ్(44 బంతుల్లో 4 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రవి శాస్త్రి(0) డకౌటవ్వగా.. క్రిష్ శ్రీకాంత్(6), దిలిప్ వెంగ్‌సర్కార్(1), సునీల్ గవాస్కర్(2), మోహిందర్ అమర్నాథ్(5), రోజర్ బిన్నీ(8), లక్ష్మణ్ శివరామకృష్ణన్(1) దారుణంగా విఫలమయ్యారు.

87 పరుగులకే కుప్పకూలిన పాక్..

అనంతరం పాకిస్థాన్ 87 పరుగులకే కుప్పకూలింది. కపిల్ దేవ్(3/17), లక్ష్మణ్ శివరామకృష్ణన్(2/16), రవి శాస్త్రి(2/17) పాక్ పతనాన్ని శాసించగా.. రోజర్ బిన్నీ, మదన్ లాల్ తలో వికెట్ తీసారు. పాకిస్థాన్ జట్టులో రమీజ్ రాజా(71 బంతుల్లో ఫోర్‌తో 29), ముదస్సర్ నజర్(18), మోహిసిన్ ఖాన్(10 నాటౌట్), సలీమ్ మాలిక్(17) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. కెప్టెన్ జావెద్ మియాందాద్(0), అష్రఫ్ అలీ(0), ఇమ్రాన్ ఖాన్(0), టౌసీఫ్ అహ్మద్(0) డకౌటయ్యారు.

40/3 స్కోర్ విజయం దిశగా సాగిన పాక్ మరో 47 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. క్రికెట్‌ మ్యాచ్ చివరి వరకు ఎలా మారుతుందో చెప్పడానికి ఈ మ్యాచ్ ఓ ఉదాహారణ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆఖరి బంతి వరకు విజయం కోసం పోరాడాలని అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నీ ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..