టీ20 ముగిసిన తర్వాత ఇప్పుడు వన్డేల వంతు వచ్చింది. టీ20 సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకోవలని ఎదురుచూస్తోంది. అయితే వన్డేల్లో ఇంగ్లండ్ జట్టు పటిష్టంగా ఉన్నందున ఈ పని అంత సులువు కాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవల్ వేదికగా జరిగే తొలి పోరులో భారత్-ఇంగ్లండ్(India vs England) మధ్య రికార్డులు, ఇరుజట్ల బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. అలాగే మారిన ఫార్మాట్‌లో గెలవాలంటే ఇరు జట్లూ తమ సత్తా చాటాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా, ఇంగ్లండ్ తన దూకుడు ఆటతో వన్డే క్రికెట్ ఆడే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. 2019 ప్రపంచకప్ టైటిల్‌తో జట్టుకు ప్రయోజనం చేకూరింది. టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు ఇంగ్లండ్ స్ఫూర్తి అని చెప్పడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది.
ప్రతి ఫార్మాట్, ప్రతి మ్యాచ్ మాకు ముఖ్యం – రోహిత్
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను పరిశీలిస్తే.. వైట్‌బాల్ ఫార్మాట్‌లో జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకమని రోహిత్ పేర్కొ్న్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 ఇంటర్నేషనల్ తర్వాత, మాకు అన్ని మ్యాచ్‌లు ముఖ్యమైనవే. వన్డేలకు ప్రాధాన్యత లేదని భావించి పక్కన పెట్టలేం. కానీ, ప్రతి ఆటగాడి పనిభారాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని మార్పులు చేస్తాం. కానీ, మ్యాచ్ గెలవడమే మా లక్ష్యం. ఇప్పుడు 50 ఓవర్ల మ్యాచ్ T20కి పొడిగింపుగా పరిగణిస్తాం.
ధావన్‌కు ఎంతో కీలకం..
వన్డే ఫార్మాట్‌లో మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శిఖర్ ధావన్ వంటి ఆటగాడికి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ చాలా కీలకం. ఎందుకంటే అతను రాబోయే వెస్టిండీస్ పర్యటనలో జట్టుకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో పరిమిత అవకాశాలు వచ్చినప్పటికీ, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నాడు. ధావన్ ODI లేదా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నప్పుడు, అతని బ్యాట్ నుంచి నిరంతరం పరుగులు వస్తున్న సంగతి తెలిసిందే.
కెప్టెన్‌గా బట్లర్ తొలి వన్డే సిరీస్..
అయితే భారత అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీ మళ్లీ రిథమ్‌లోకి వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఈ పర్యటనలో, అతని బ్యాట్‌కు టెస్టు, టీ20లలో పరుగులు రాలేదు. జట్టు కొత్త విధానం చూస్తుంటే తొలి బంతి నుంచే పరుగులు సాధించాలనే ఒత్తిడి అతనిపై ఉంటుంది. వన్డే ఫార్మాట్‌తో అయితే, అతను ఫాం అందుకోవడానికి కొంత సమయం ఉంటుంది. మరి వన్డే సిరీస్‌లోనైనా తన ఓల్డ్ ఫాంను పొందుతాడో లేదో చూడాలి.
మోర్గాన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా జోస్ బట్లర్‌కు ఇదే తొలి వన్డే సిరీస్. టీ20 సిరీస్‌లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. కెప్టెన్ కూడా పేలవమైన ప్రదర్శనను వదిలి మళ్లీ జోరందుకోవాలని కోరుకుంటున్నాడు.