నాడు వెస్టిండీస్‌పై బీభత్సం సృష్టించాడు.. నేడు జట్టులోనే ప్లేస్ కోల్పోయాడు.. అసలు తెలుగబ్బాయ్ ఏమయ్యాడు?
డబ్ల్యూటీసీ ఓటమి అనంతరం టీమిండియా తన తదుపరి సిరీస్‌కు సిద్దమవుతోంది. ఈ నెల 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
డబ్ల్యూటీసీ ఓటమి అనంతరం టీమిండియా తన తదుపరి సిరీస్‌కు సిద్దమవుతోంది. ఈ నెల 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. విండీస్ పర్యటనలో ఉన్న రోహిత్ సేన.. ప్రస్తుతం బార్బడోస్‌లో ప్రాక్టీస్ సెషన్లు కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే.. బీసీసీఐ సెలెక్టర్లు ఈసారి ఆచితూచి టెస్టు సిరీస్‌కు, వన్డే సిరీస్‌కు జట్లను ఎంపిక చేశారు. కొందరు సీనియర్లకు విశ్రాంతినివ్వడం, మరికొందరిపై వేటు వేయడం జరగ్గా.. ఈ సిరీస్‌లో పలువురు యువ ఆటగాళ్లకు అద్భుత అవకాశాన్ని ఇచ్చారు సెలెక్టర్లు. అయితే ఇవన్నీ పక్కనపెడితే.. 4 సంవత్సరాల క్రితం వెస్టిండీస్‌లో భారీగా పరుగులు చేసి.. భారత్‌ను గెలిపించిన ఆ ప్లేయర్‌ను మాత్రం సెలెక్టర్లు పూర్తిగా మర్చిపోయారు.
2019లో చివరిసారిగా టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించినప్పుడు.. జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా, రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. ఇక కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా లాంటి సీనియర్ ప్లేయర్లతో మిడిలార్డర్ స్ట్రాంగ్‌గా ఉంది. అయితే ఆ సమయంలో ఈ నలుగురు విఫలం కావడంతో.. అజింక్య రహనే, హనుమ విహారి జట్టును కాపాడారు. ఇప్పుడు రహనే టీంలో ఉన్నా.. విహారిని మాత్రం సెలెక్టర్లు పక్కనపెట్టేశారు.
నాలుగేళ్ల క్రితం భారత్, వెస్టిండీస్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరిగింది. ఇందులో టీమిండియా 2-0తో సిరీస్‌ను గెలుచుకుంది. ఈ విజయాల్లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ హనుమ విహారి కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ దేశవాళీ క్రికెట్ అనంతరం విహారికి జాతీయ జట్టులో చోటు దక్కింది. పుజారాకు ప్రత్యామ్నాయంగా అతడ్ని పరిగణించింది టీం మేనేజ్‌మెంట్. దాన్ని నిరూపించాడు విహారి. ఆరో నెంబర్‌లో బ్యాటింగ్‌కి దిగిన అతడు 4 ఇన్నింగ్స్‌ల్లో అత్యధికంగా 289 పరుగులు చేశాడు. 96 సగటుతో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు బాదేశాడు.
ఇంతటి పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ.. జట్టులో పుజారా, రహానే, కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉండటంతో.. తెలుగబ్బాయ్ విహారిని సెలెక్టర్లు పూర్తిగా పక్కనపెట్టేశారు. ఒకవైపు సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, రజత్ పాటిదార్ వంటి యువ ప్లేయర్లు దూకుడుగా పరుగులు సాధిస్తుండగా.. మరోవైపు శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మాన్ గిల్ లాంటి ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తున్నారు. ఈ నేపధ్యంలో విహారి ఒక్క టెస్టు ఫార్మాట్ ఆడటానికి ఛాన్స్ ఉండటంతో అతడికి ఛాన్స్‌లు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆంధ్రాను వదిలి మధ్యప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్న విహారి.. త్వరలోనే టీమిండియాలోకి పునరాగమనం చేస్తాడో.? లేదో.? చూడాలి.