
IND vs WI : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 2 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. ముఖ్యంగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. సెంచరీతో పాటు 150 పరుగుల మార్కును కూడా దాటిన జైస్వాల్, డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.
ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు పటిష్టమైన స్థితిలో ఉంది. టీమిండియా 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో మెయిన్ హీరో యశస్వి జైస్వాల్ అనే చెప్పాలి. స్టంప్స్ సమయానికి జైస్వాల్ 173 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో ఐదోసారి 150 పరుగుల మార్కును దాటడం విశేషం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 20 పరుగులతో జైస్వాల్‌కు తోడుగా ఉన్నాడు.
అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ ఈసారి కేవలం 38 పరుగులు చేసి అవుటయ్యాడు. రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్, జైస్వాల్‌తో కలిసి వెస్టిండీస్ బౌలర్లను బాగా అలసిపోయేలా చేశాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు ఏకంగా 193 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. సుదర్శన్ తన టెస్ట్ కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా 87 పరుగులు చేసి, సెంచరీకి కొద్ది దూరంలో అవుటయ్యాడు. భారత్ జట్టు 251 పరుగుల వద్ద సుదర్శన్ రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. సుదర్శన్‌ను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వారికన్ క్లీన్ బౌలింగ్‌తో బోల్తా కొట్టించాడు.
యశస్వి జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో ఇది ఐదోసారి 150 పరుగుల మార్కు దాటడం ద్వారా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు గనుక అతను డబుల్ సెంచరీ (200 పరుగులు) సాధిస్తే, అది అతని కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ అవుతుంది. అంతేకాకుండా, ఏదైనా ఒక టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజునే 150 పరుగుల మార్కును అందుకోవడం జైస్వాల్‌కి ఇది రెండోసారి. దీనికి ముందు అతను 2024లో ఇంగ్లాండ్‌పై విశాఖపట్నం టెస్టులో మొదటి రోజు 179 పరుగులు సాధించాడు. వెస్టిండీస్ బౌలర్లు ఈ రోజు మొత్తం జోమెల్ వారికన్ తీసిన రెండు వికెట్లకే పరిమితమై, మిగతా సమయంలో భారత బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు.
మొదటి రోజు ఆటలో మూడు సెషన్లలో టీమిండియా ప్రదర్శన విషయానికి వస్తే.. మొదటి సెషన్లో కేఎల్ రాహుల్ రూపంలో ఒక వికెట్ కోల్పోయి 94 పరుగులు సాధించింది. రెండవ సెషన్లో భారత జట్టు ఎలాంటి వికెట్ కోల్పోకుండా మొత్తం 126 పరుగులు చేసింది. మూడవ సెషన్‌లో 98 పరుగులు వచ్చాయి. అయితే, సాయి సుదర్శన్ వికెట్‌ను భారత్ కోల్పోయింది. జైస్వాల్, గిల్ జోడి 67 పరుగుల భాగస్వామ్యంతో రోజును ముగించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..