INDW vs ENGW,2nd ODI: దేశమంతా నిద్రపోతున్న సమయంలో ఇంగ్లండ్ గడ్డపై భారత అమ్మాయిలు ఇంగ్లండ్‌లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు. రెండో వన్డేలో అద్భుత విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్నారు. తద్వారా 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్రను లిఖించారు. ఈ చారిత్రాత్మక విజయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రేణుకా సింగ్ కీలక పాత్రల పోషించారు. మొదట హర్మన్‌ప్రీత్ కౌర్ ఇంగ్లిష్ బౌలర్లను చిత్తు చేసి అజేయంగా 143 పరుగులు చేయగా.. ఆపై రేణుక స్వింగ్ ధాటికి ఇంగ్లిష్ జట్టు 245 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
శుభారంభం దక్కకపోయినా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్లకు 333 పరుగులు చేసింది. అయితే భారతజట్టుకు ప్రారంభంలో సరైన ఆరంభం దక్కలేదు.12 పరుగుల వద్ద షెఫాలీ వర్మ వికెట్ రూపంలో తొలి దెబ్బ తగిలింది. ఆతర్వాత యాస్తికా భాటియా రూపంలో 66 పరుగులకే వికెట్ కోల్పోయింది. అయితే స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ జట్టును గట్టెక్కించే బాధ్యతలను తీసుకున్నారు. అయితే 99 పరుగుల వద్ద మంధాన కూడా పెవిలియన్‌కు చేరుకుంది. దీంతో కెప్టెన్ హర్మన్‌పై మొత్తం భారం పడింది. అందుకు తగ్గట్టుగానే హర్లీన్ డియోల్ (58)తో కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించింది. 212 పరుగుల వద్ద హర్లీన్ ఔటైనా పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ సహకారంతో జట్టు స్కోరును 333 పరుగులకు చేర్చింది. హర్మన్‌ప్రీత్ మొత్తం 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 143 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచింది.
India won by a massive 88 Run margin against England#ENGvIND #CricketTwitter pic.twitter.com/pYJcUgZdG5
— Female Cricket (@imfemalecricket) September 21, 2022
రేణుక చుక్కలు..
కాగా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టుకు భారత అమ్మాయిలు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్వింగ్ కింగ్ రేణుక 10 ఓవర్లలో 57 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ఎమ్మా లంబ్, సోఫీ డంక్లీ, అలిస్ క్యాప్సీ, డేనియల్ వ్యాట్‌లను పెవిలియన్‌కు పంపించింది. ఆమెతో పాటు హేమలత 6 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. దీప్తి శర్మ, షెఫాలీ వర్మ ఒక్కో వికెట్ తీసి ఇంగ్లండ్‌ను సమష్ఠిగా దెబ్బకొట్టారు. ఇంగ్లాండ్ తరఫున వ్యాట్ అత్యధికంగా 65 పరుగులు చేసింది.
4 Wicket Haul for Renuka Singh Thakur – took wickets at crucial junctures of the game and ensured India wins the 2nd ODI ?#ENGvIND #CricketTwitter pic.twitter.com/AUv2R6Awrz
— Female Cricket (@imfemalecricket) September 21, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..