ICC U19 World Cup 2026:అండర్-19 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..ఇండియా తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
ICC U19 World Cup 2026: 2026 అండర్-19 వరల్డ్ కప్ జింబాబ్వే, నమీబియాలో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. పూర్తి షెడ్యూల్, గ్రూపులు, వెన్యూ వివరాలు తెలుసుకుందాం.

ICC U19 World Cup 2026: క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2026 సమరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి ఈ మెగా టోర్నీకి జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. జనవరి 15న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 6 వరకు సాగనుంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం తలపడనున్నాయి. యువ క్రికెటర్ల ప్రతిభను ప్రపంచానికి చాటే ఈ వేదికపై భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ టోర్నీలో పాల్గొనే 16 జట్లను ఐసీసీ నాలుగు గ్రూపులుగా విభజించింది. గ్రూప్-A లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక ఉండగా.. గ్రూప్-B లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అమెరికా ఉన్నాయి. గ్రూప్-C లో ఇంగ్లాండ్, పాకిస్థాన్, స్కాట్లాండ్, ఆతిథ్య జింబాబ్వే పోటీపడుతున్నాయి. గ్రూప్-D లో ఆఫ్ఘనిస్థాన్, సౌతాఫ్రికా, టాంజానియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి.
ఈ టోర్నీలో భారత జట్టు తన ప్రయాణాన్ని జనవరి 15న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత జనవరి 17న బంగ్లాదేశ్‌తో, జనవరి 24న న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. గ్రూప్ దశలో భారత్ ఆడే మ్యాచులన్నీ బులవాయోలోనే నిర్వహించనున్నారు. అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న భారత్, ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఈ ప్రపంచకప్ కోసం మొత్తం ఐదు స్టేడియాలను ఎంపిక చేశారు. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో మ్యాచులు జరుగుతాయి. నమీబియాలోని విన్ఢోక్‌లో ఉన్న నమీబియా క్రికెట్ గ్రౌండ్, హెచ్‌పీ ఓవల్‌లో మరికొన్ని మ్యాచులు నిర్వహిస్తారు. సూపర్ సిక్స్ దశ ముగిసిన తర్వాత టాప్-2 జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. మొదటి సెమీ ఫైనల్ ఫిబ్రవరి 3న, రెండో సెమీ ఫైనల్ ఫిబ్రవరి 4న జరగనుండగా.. గ్రాండ్ ఫినాలే ఫిబ్రవరి 6న హరారేలో జరగనుంది.
గ్రూప్ దశ ముగిసిన వెంటనే జనవరి 25 నుంచి సూపర్ సిక్స్ మ్యాచులు ప్రారంభమవుతాయి. ఈ దశలో జట్లు తమ సత్తా చాటి సెమీస్ బెర్త్ దక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తాయి. యువ ఆటగాళ్లు తమ కెరీర్‌ను మలుపు తిప్పుకునే గొప్ప అవకాశం కావడంతో ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా వంటి జట్లు టైటిల్ రేసులో ముందు వరుసలో ఉన్నాయి. క్రికెట్ అభిమానులకు వచ్చే మూడు వారాల పాటు అసలైన వినోదం లభించనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
